Tomato Methi Masala Curry : మనం టమాటాలతో ఎంతో రుచిగా ఉండే టమాట కూరను తయారు చేస్తూ ఉంటాం. టమాట కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ టమాట కూరలో మెంతికూరను వేసి మనం మరింత రుచిగా కూరను తయారు చేసుకోవచ్చు. మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతికూరతో చేసే కూరలు కూడా చాలా రుచిగా ఉంటాయి. టమాటాలు, మెంతికూరతో రుచిగా మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట మేథీ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన టమాటాలు – అరకిలో, చిన్న మెంతికూర కట్టలు – 2, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, యాలకులు – 2, లవంగాలు – 3, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, పచ్చి కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
టమాట మేథీ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా జార్ లో నువ్వులు, పచ్చికొబ్బరి ముక్కలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత మెంతికూర, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. తరువాత దీనిని చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత అర గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కరివేపాకు వేసి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట మేథీ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.