Ragi Dates Java : మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. రాగులను పిండిగా చేసి మనం రొట్టె, సంగటి, జావ వంటి వాటిని తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటాం. రాగిపిండితో చేసే జావ చాలా రుచిగా ఉంటుంది. వేసవికాలంలో రాగిజావను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఈ రాగిజావలో ఖర్జూరాలు వేసి రుచిగా ఆరోగ్యానికి మరింత మేలు చేసేలా తయారు చేసుకోవచ్చు. ఖర్జూరాల్లో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కూడా మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా రాగి ఖర్జూరం జావను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి ఖర్జూరం జావ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – ఒక కప్పు, ఖర్జూరాలు – 8, రాగిపిండి – అర కప్పు, నీళ్లు – పావు లీటర్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
రాగి ఖర్జూరం జావ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అర కప్పు పాలు, గింజలు తీసేసిన ఖర్జూరాలను వేసి ఉడికించాలి. ఖర్జూరాలు మెత్తగా ఉడికి దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రాగిపిండి, ముప్పావు కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత ముందుగా కలిపి ఉంచిన రాగిపిండిని వేసి కలపాలి. తరువాత దీనిని దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పేస్ట్, పాలు, యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి ఖర్జూరం జావ తయారవుతుంది. దీనిని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తాగవచ్చు. అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారు కూడా దీనిని తాగవచ్చు. ఈ విధంగా రాగిపిండి, ఖర్జూరాలతో జావను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ జావలో మనం ఇతర డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకుని తాగవచ్చు. వేసవికాలంలో ఈ విధంగా జావను తయారు చేసుకుని తాగడం వల్ల వేసవి తాపం తగ్గడంతో పాటు శరీరానికి శక్తి కూడా లభిస్తుంది.