Almonds : మన శరీరంలో ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండాలంటే మనం పోషకాలు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలను ఎక్కువగా కలిగి ఉండే ఆహారాల్లో బాదం పప్పు ఒకటి. దీనిలో ఉండే కొన్ని రకాల పోషకాలు మరే ఇతర ఆహారాల్లో కూడా ఉండవు. వీటిని వేళ్లత్తో లెక్కపెట్టి తీసుకున్నప్పటికి మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రతిరోజూ బాదం పప్పును తీసుకోవడం వల్ల నీరసం, ఒత్తిడి, బలహీనత, చికాకు వంటి వాటిని దూరం చేసుకోవచ్చు. వీటిలో ఉండే ఫైబర్, విటమిన్ ఇ, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదం పప్పు గురించి అందరికి తెలిసినప్పటికి రోజూ వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలి..ఎలా తీసుకోవాలి.. వంటి వాటి గురించి మనలో చాలా మందికి తెలియదు.
బాదంపప్పును ఎన్ని తీసుకోవాలి..అలాగే ఎలా తీసుకుంటే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.. అదే విధంగా వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి..అన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాదంపప్పును నేరుగా తినడం కంటే వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. బాదం పప్పును 8 గంటల పాటు నీటిలో నానబెట్టి తీసుకోవాలి. నానిన బాదంపప్పు పై ఉండే పొట్టును తీసేసి తినాలి. ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల బాదంపప్పు త్వరగా జీర్ణమవ్వడంతో పాటు దీనిలో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. బాదం పొట్టులో ఉండే ట్యానిన్ లు వాటిలో ఉండే పోషకాలు శరీరానికి అందకుండా అడ్డుపడతాయి. కనుక బాదంపప్పును నానబెట్టి పొట్టు తీసేసి తినడం మంచిది. ఈ విధంగా బాదంపప్పును తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే వీటిలో పోషకాలు మెదడుకు శక్తిని అందిస్తాయి. మెదడు కణజాలాన్ని కాపాడుతాయి. మెదడు పనితీరును మెరుగుస్తాయి. బాదంపప్పును తినడం వల్ల వయసు పైబడడం వల్ల వచ్చే మతిమరుపు రాకుండా ఉంటుంది. అలాగే చదువుకునే పిల్లలకు వీటిని ఆహారంగా ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బాదంపప్పును తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. బాదంపప్పును తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. బాదంపప్పును తినగానే పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీంతో మనకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. మన దృష్టి ఇతర చిరుతిళ్లపై పోకుండా ఉంటుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు.
అలాగే బాదంపప్పును తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజూ బాదంపప్పును తీసుకునే వారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు బాదంపప్పును తీసుకోవడం వల్ల తల్లి ఆరోగ్యంతో పాటు గర్భస్త శిశువు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే ప్రతి ఒక్కరు వేసవికాలంలో 4 నుండి 5 బాదంపప్పును తీసుకోవాలి. అదే విధంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు 8 నుండి 10 బాదంపప్పులను నానబెట్టి తీసుకోవాలి. ఈ విధంగా బాదం పప్పును నానబెట్టి పొట్టు తీసేసి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని అనేక అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.