Eggless Tutty Fruity Cup Cakes : మనకు బేకరీలల్లో లభించే చిరుతిళ్లల్లో కప్ కేక్స్ కూడా ఒకటి. కప్ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కోడిగుడ్లు వేసే అవసరం లేకుండా ఈ కప్ కేక్స్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కప్ కేక్స్ ను తయారు చేయడం చాలా తేలిక. కుక్కర్ లో కూడా ఈ కప్ కేక్స్ ను మనం తయారు చేసుకోవచ్చు. మెత్తగా, రుచిగా టూటీ ఫ్రూటీ కప్ కేక్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ లెస్ టూటీ ప్రూటీ కప్ కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
రిఫైండ్ నూనె – రెండున్నర టేబుల్ స్పూన్స్, పెరుగు – ఒకటిన్నర టేబుల్ స్పూన్స్, పంచదార – పావు కప్పు, ఫైనాఫిల్ ఎసెన్స్ – 3 చుక్కలు, వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్, వెనిగర్ – ఒక టేబుల్ స్పూన్, మైదాపిండి – అర కప్పు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, పచ్చిపాలు – పావు కప్పు, రెడ్ టూటీ ఫ్రూటీ – ఒక టేబుల్ స్పూన్స్, గ్రీన్ టూటీ ప్రూటీ – ఒక టేబుల్ స్పూన్.
ఎగ్ లెస్ టూటీ ప్రూటీ కప్ కేక్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నూనె, పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి. పంచదార కరిగిన తరువాత ఫైనాఫిల్ ఎసెన్స్, వెనీలా ఎసెన్స్, వెనిగర్ వేసి మరో 3 నిమిషాల పాటు కలపాలి. తరువాత గిన్నెపై జల్లెడను ఉంచి అందులో మైదాపిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి జల్లించాలి. తరువాత పిండి అంతా కలిసేలా ఒకే దిశలో బాగా కలపాలి. పిండి చక్కగా కలిసిన తరువాత కొద్ది కొద్దిగా పాలు పోసి కలపాలి. తరువాత టూటీ ఫ్రూటీ వేసి కలపాలి. ఇప్పుడు కప్స్ లో కేక్ మిశ్రమాన్ని సగానికి వేయాలి. తరువాత తరువాత వీటిని మౌల్డ్స్ ఉంచి ఫ్రీ హీటెడ్ ఒవెన్ లో 180 డిగ్రీల వద్ద 12 నుండి 18 నిమిషాల పాటు ఉడికించాలి. ఒవెన్ లేని వారు విజిల్ తీసేసి కుక్కర్ ను పది నిమిషాల పాటు వేడి చేయాలి.
తరువాత అందులో స్టాండ్ ను ఉంచి కప్స్ ను ఉంచాలి. వీటిని 18 నుండి 20 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. అలాగే కప్స్ అందుబాటులో లేని వారు చిన్న గ్లాస్ లకు నెయ్యి రాసి అందులో కేక్ ను వేయాలి. ఇలా ఉడికించిన తరువాత కేక్స్ ను బయటకు తీసి పూర్తిగా చల్లారిన తరువాత డీమౌల్డ్ చేసుకుని తినాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఎగ్ లెస్ టూటీ ప్రూటీ కప్ కేక్స్ తయారవుతాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. బయట కొనుగోలు చేసే పనిలేకుండా ఇంట్లోనే ఇలా కప్ కేక్స్ ను తయారు చేసుకుని తినవచ్చు.