Dondakaya Nuvvula Karam : దొండకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దొండకాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో దొండకాయ ఫ్రై కూడా ఒకటి. దొండకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ దొండకాయ ఫ్రైను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇందులో నువ్వుల కారం వేసి మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసే ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా తేలిక. మరింత రుచిగా నువ్వుల కారం వేసి దొండకాయ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ నువ్వుల కారం ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా పొడుగ్గా తరిగిన దొండకాయలు – అర కిలో, తరిగిన ఉల్లిపాయ – 1, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 5 లేదా తగినన్ని, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
దొండకాయ నువ్వుల కారం ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో ధనియాలు, జీలకర్ర, పల్లీలు, కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. ఇవి సగానికి పైగా వేగిన తరువాత ఎండుమిర్చి, నువ్వులు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు సగానికి పైగా వేగిన తరువాత దొండకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని కరకరలాడే వరకు వేయించుకున్న తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి.
దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ నువ్వుల కారం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా నువ్వుల కారం వేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన దొండకాయ ఫ్రైని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.