Tomato Masala Bajji : మనకు సాయంత్రం సమయాల్లో బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో టమాట బజ్జి మసాలా కూడా ఒకటి. టమాటాలతో చేసే మసాలా బజ్జీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ టమాట బజ్జి మసాలాను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అచ్చం బండ్ల మీద లభించే రుచితో మనం ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే టమాట బజ్జి మసాలాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట బజ్జి మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – 5, శనగపిండి – ఒక కప్పు, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, గరం మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వేయించిన పల్లీలు – పావు కప్పు.
టమాట బజ్జి మసాలా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యం పిండి, వంటసోడా, ఉప్పు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. పిండిని మరీ పలుచగా కలుపుకోకూడదు. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక టమాటాలను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. బజ్జీలను మధ్యస్థ మంటపై వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత బజ్జీలను మధ్యలోకి కట్ చేసుకోవాలి. తరువాత వాటి మధ్యలో ఉండే టమాటాలను తీసి బజ్జీలను పక్కకు ఉంచాలి. ఇప్పుడు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, వేయించిన పల్లీలు, నిమ్మరసం వేసి కలపాలి. ఇప్పుడు మసాలాను బజ్జిలో ఉంచి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట బజ్జి మసాలా తయారవుతుంది. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ మసాలా చాలా చక్కగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.