Cold And Cough : వాతావరణం మారినప్పుడల్లా అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల మనలో చాలా మంది తరచూ జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో వీటి బారిన పడాల్సిందే. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. వీటి కారణంగా జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి బయటపడడానికి యాంటీ బయాటిక్ లను, సిరప్ లను వాడుతూ ఉంటారు. వీటిని తాగడం వల్ల ఉపశమనం ఉన్నప్పటికి వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మన ఇంట్లో ఉండే ఔషద గుణాలు కలిగిన పదార్థాలతో ఒక చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు. జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనాన్ని కలిగించే ఈ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక ఇంచు అల్లం ముక్కను దంచి వేసుకోవాలి. తరువాత ఇందులో ఒక బిర్యానీ ఆకు ముక్కలను వేసుకోవాలి. తరువాత 4 మిరియాలను, 2 యాలకులను, 4 లవంగాలను పొడిగా చేసి నీటిలో వేసుకోవాలి.
తరువాత ఈ నీటిలో పావు టీ స్పూన్ నల్ల ఉప్పును, 6 నుండి 7 తులసి ఆకులను , ఒక చిన్న నల్ల బెల్లం ముక్కను, అర టీ స్పూన్ వామును, అర టీ స్పూన్ దాల్చిన చెక్క ముక్కను వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ పసుపును వేసి కలపాలి. తరువాత ఈ నీటిని సగం అయ్యే వరకు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజుకు మూడు పూటలా పూటకు ఒక కప్పు మోతాదులో గోరు వెచ్చగా తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతులో పేరుకుపోయిన కఫం, ఛాతిలో మంట వంటి శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఈ కషాయంలో వాడిన పదార్థాలన్నీ కూడా సహజ సిద్దమైనవే. కనుక ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ చిట్కాను వాడడం వల్ల మనం చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు.