Unwanted Hair Pack : ప్రస్తుత కాలంలో చాలా మంది అవాంఛిత రోమాల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడే స్త్రీల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. హార్మోన్ల అసమతుల్యత, పిసిఒడి, అలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యల కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. అవాంఛిత రోమాల కారణంగా మనం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల ముఖం అందవిహీనంగా కనబడుతుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయట పడడానికి వ్యాక్స్, రేజర్స్, త్రెడ్డింగ్ వంటి వాటిని ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించడం వల్ల సమస్య తీరినప్పటికి ఆ భాగంలో చర్మం కోమలత్వాన్ని కోల్పోయి మందంగా, నల్లగా మారుతుంది. అలాగే ఇవి నొప్పిని కూడా కలిగిస్తాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.
ఈ చిట్కాను తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా తేలిక. అవాంఛిత రోమాలను తొలగించే ఈ చిట్కా ఏమిటి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం శనగపిండిని, రోజ్ వాటర్ ను, పసుపును, పెట్రోలియం జెల్లీని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో అర టీ స్పూన్ పెట్రోలియం జెల్లీని తీసుకోవాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ పసుపును, ఒకటిన్నర టీ స్పూన్ శనగపిండిని వేసి కలపాలి. తరువాత ఇందులో తగినన్ని రోజ్ వాటర్ ను వేసి ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం మరీ గట్టిగా మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖంపై అవాంఛిత రోమాలు ఉన్న చోట మందంగా రాయాలి. దీనిని పూర్తిగా ఆరే వరకు అలాగే ఉంచాలి.
ఈ మిశ్రమం ఆరిన తరువాత అవాంఛిత రోమాలకు వ్యతిరేక దిశలో నెమ్మదిగా రుద్దుతూ ఈ మిశ్రమాన్ని తొలగించుకోవాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలను చాలా సులభంగా తొలగించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోవడంతో పాటు ఆ భాగంలో చర్మానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాను ఉపయోగించి నొప్పి, బాధ లేకుండా మనం చాలా సులభంగా అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.