నిత్యం తగిన సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం, సరైన సమయంలో నిద్రపోవడం ఎంత అవసరమో అలాగే మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలి. అలా చేస్తేనే ఎప్పటికీ ఫిట్‌గా ఉంటారు. డయాబెటిస్, గుండె జబ్బులు, అధిక బరువు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలో వయస్సు పెరుగుతున్నప్పటికీ ఎలాంటి అనారోగ్యాలు దరి చేరవు. అయితే చాలా మందిలో వ్యాయామం పట్ల ఓ అపోహ నెలకొని ఉంది. అదేమిటంటే… సాయంత్రం పూట వ్యాయామం చేస్తే ఎలాంటి ఫలితం ఉండదని, కేవలం ఉదయం చేసే వ్యాయామంతోనే ఫలితాలు కలుగుతాయని కొందరు నమ్ముతారు. అయితే ఇందులో ఎంత నిజం ఉంది..? తెలుసుకుందాం రండి..!
వ్యాయామం చేయాలనే తపన ఉండాలే గానీ అందుకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని తేడా లేదు. ఎప్పుడైనా ఎవరైనా ఏ సమయంలోనైనా వ్యాయామం చేయవచ్చు. ఏ సమయంలో వ్యాయామం చేసినా దాని వల్ల మనకు కలిగే లాభాలు ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే ఉదయం పూట చేస్తే ఎక్కువ క్యాలరీలు త్వరగా ఖర్చయి బరువు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుందని డైటిషియన్స్ చెబుతున్నారు. అయినప్పటికీ సాయంత్రం పూట చేసినా శరీరానికి వ్యాయామం మంచిదే. అప్పుడు చేసినా క్యాలరీలు ఖర్చవుతాయి. దీంతో రాత్రి పూట చక్కగా నిద్రపడుతుంది.
అయితే సాయంత్రం వ్యాయామం చేసే వారు మాత్రం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. అదేమిటంటే… సాయంత్రం పూట తీవ్రంగా వ్యాయామం చేయకూడదు. ఓ మోస్తరు వ్యాయామం చేయాలి. చాలా లైట్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. రన్నింగ్, జాగింగ్‌కు బదులుగా వాకింగ్ చేస్తే బెటర్. అదేవిధంగా జిమ్‌కు వెళ్లేవారు కూడా తేలిక పాటి బరువులు ఎత్తాలి. ఇక ఎరోబిక్స్ వంటివి చేసే వారు కొంత సేపు మాత్రమే చేయాలి. బాగా ఎక్కువ సేపు చేయకూడదు. ఒక వేళ ఎక్కువ సేపు చేస్తే శరీరం బాగా అలసి పోతుంది. సాధారణంగా ఎవరైనా రోజంతా పనిచేసే సరికి సాయంత్రానికి అలసిపోతారు. ఈ క్రమంలో అప్పుడు వ్యాయామం తీవ్రంగా చేస్తే దాంతో శరీరం ఇంకా అలసిపోతుంది. దీంతో తరువాతి రోజు ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి అనారోగ్య లక్షణాలు కనిపించేందుకు అవకాశం ఉంటుంది. అదే సాయంత్రం పూట లైట్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తే శరీరం ఎక్కువ అలసిపోదు కాబట్టి మరుసటి రోజు కూడా యాక్టివ్‌గా ఉంటారు. అంతేకానీ… కేవలం ఉదయం మాత్రమే వ్యాయామం చేయాలి, సాయంత్రం చేయకూడదు అని కాదు. ఎవరైనా, ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నిరభ్యంతరంగా వ్యాయామం చేయవచ్చు. కాకపోతే ముందే చెప్పాం కదా, ఆ సూచనలు పాటిస్తే చాలు. దీంతో ఎవరైనా ఫిట్‌నెస్ సాధించవచ్చు..!