నిత్యం వ్యాయామం చేయడం, తగిన పోషకాలతో కూడిన ఆహారాన్ని సరైన వేళకు మితంగా తీసుకోవడం… తదితర నియమాలను పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే వీటితోపాటు ప్రతి వ్యక్తికి తగినంత నిద్ర కూడా అవసరం. నిద్ర లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. నిద్ర పోవడం వల్ల శరీరం రీచార్జ్ అవడమే కాదు, కొన్ని అనారోగ్యాలు దూరమవుతాయి, దేహంలో ఉన్న అవయవాలకు మరమ్మత్తులు కూడా జరుగుతాయి. అయితే నేటి ఉరుకుల, పరుగుల జీవితంలో అధిక శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించడం, నిద్ర మాత్రలు తీసుకోవడం వంటి అలవాట్లను చేసుకుని వాటితో తాత్కాలికంగా నిద్రపోతున్నారు. కానీ వీటి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని వాస్తు శాస్త్ర నియమాలను పాటిస్తే సులభంగా నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. అంతేకాదు అసలు మనం తల ఎటు వైపు పెట్టి నిద్రించాలో కూడా తెలుసుకోవచ్చు. ఆ వాస్తు నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు తూర్పు వైపుకు తల పెట్టి నిద్రిస్తే చక్కగా నిద్ర పడుతుందట. ఇలా నిద్రించడం వల్ల ఎక్కువ సేపు హాయిగా నిద్ర పోతారట. పశ్చిమం, దక్షిణ దిశల్లోనూ తలను ఉంచి నిద్రపోవచ్చు. ఇలా నిద్రిస్తే శరీరంలో ఉన్న పాజిటివ్ శక్తి ఉత్తేజమవుతుందట. అంతే కాదు రక్త సరఫరా కూడా మెరుగు పడుతుందట. ఉదయాన్నే ఎంతో ఉత్తేజంగా ఉంటారట.
ఉత్తరం వైపు తల పెట్టి మాత్రం నిద్రించకూడదట. ఎందుకంటే ఆ వైపు తల ఉంచి నిద్రిస్తే పీడకలలు ఎక్కువగా వస్తాయట. దీంతోపాటు నిద్ర కూడా సరిగా పట్టదట.
నైరుతి (దక్షిణం-పడమర మధ్యన) దిశగా తలను పెట్టి నిద్రిస్తే ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారట. ఎందుకంటే ఆ దిక్కులో పాజిటివ్ శక్తి ఎక్కువగా ఉంటుందట. ఆ శక్తి అంతా మనకు అందుతుందట. నిద్రలేమి సమస్య ఉన్న వారు ఈ దిశగా తలను పెట్టి నిద్రిస్తే వెంటనే ఆ సమస్య తొలగిపోతుందట. అయితే నైరుతి దిశలో కిటికీలు, తలుపులు ఏవీ ఉండరాదట. లేదంటే ఆ శక్తి అంతా బయటకు పోతుందట.