Tomato Pickle : టమాట పచ్చడి.. ఈ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో మనందరికి తెలిసిందే. వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పచ్చడి తయారు చేసుకోవడం శ్రమతో, అలాగే ఎక్కువ సమయంతో కూడిన పని అని భావిస్తూ ఉంటారు. రోజుల తరబడి చేసే పని లేకుండా ఎండలో ఎండబెట్టే పని లేకుండా కేవలం గంటలోనే ఈ రుచిగా ఉండే టమాట పచ్చడిని తయారు చేసుకోవచ్చు. టమాట పచ్చడిని రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – ఒక కిలో, నూనె – 50 ఎమ్ ఎల్, చింతపండు – 100 గ్రా., రాళ్ల ఉప్పు – పావు కిలో, పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు – 20, ఆవాలు – మూడు టేబుల్ స్పూన్స్, మెంతులు – ఒక టేబుల్ స్పూన్, కారం – పావు కిలో.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటిన్నర కప్పు, ఆవాలు – ఒక టిన్నర టీ స్పూన్, శనగపప్పు – రెండు టీ స్పూన్స్, మినపప్పు – 2 టీ స్పూన్స్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 8, ఎండుమిర్చి – 5, ఇంగువ – అర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు.
టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగా టమాటాలను తొడిమె తీయకుండా శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని తడి లేకుండా చక్కగా తుడవాలి. తరువాత వాటిని గాలికి ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టిన తరువాత టమాటాల తొడిమలు తీసేస్తూ వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. తరువాత ఒక గిన్నెలో టమాట ముక్కలు, నూనె వేసి కలపాలి. వీటిని స్టవ్ మీద ఉంచి ఉడికించాలి. టమాట ముక్కలపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వాటిని మెత్తగా ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత మూత తీసి చింతపండు వేసి కలపాలి. తరువాత చింతపండు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి.
ఉప్పు కరిగే వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. వీటిని చిటపడలాడే వరకు వేయించి ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో జార్ లో ఉడికించిన టమాటాలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కారం, మిక్సీ పట్టుకున్న ఆవాల మిశ్రమం వేసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి.
తాళింపు చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి తాళింపును చల్లారనివ్వాలి. తరువాత ఈ తాళింపును ముందుగా తయారు చేసిన పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని తడి లేని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకోవడం వల్ల పచ్చడి ఆరు నెలల వరకు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.