Ippa Chettu : ఇప్ప చెట్టు.. ఈ చెట్టును మనలో చాలా మంది చూసే ఉంటారు. గ్రామాల్లో అక్కడక్కడ అలాగే అడవులల్లో ఎక్కువగా ఈ చెట్టు కనిపిస్తుంది. ఇప్ప చెట్టు పూల నుండి తీసిన ఇప్పసారాను చాలా మంది తాగుతారు. ఇప్పసార మత్తును ఇస్తుంది. ఇప్ప చెట్టు నుండి వచ్చే ఇప్పసారను తాగుతారన్న విషయమే మనలో చాలా మందికి తెలుసు. కానీ ఇప్ప చెట్టు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుందని దీనిని ఉపయోగించి మనం అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని మనలో చాలా మందికి తెలియదు. ఇప్ప చెట్టులో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే దీనిని వాడడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుక, మధు పుష్ప అని హిందీలో మధువా అని పిలుస్తారు.
ఇప్ప పూలతో చేసే ఇప్ప సారా మత్తుగా ఉన్నప్పటికి శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. దీనిని తాగడం వల్ల వాత, పిత, కఫ రోగాలు హరించుకుపోతాయి. అతి ధాహం సమస్యతో బాధపడే వారు ఇప్ప పువ్వును నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల అతిదాహం సమస్య తగ్గుతుంది. ఇప్ప చెట్టు బెరడును పది గ్రాముల మోతాదులో తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత దీనిని కచ్చా పచ్చాగా దంచాలి. ఈ బెరడును ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ కషాయాన్ని వడకట్టి మూడు పూటలా తాగుతూ ఉంటే శరీరంలో ఏ భాగంలో నుండి కారే రక్తమైన ఆగిపోతుంది. ఇప్ప పూలను మెత్తగా దంచి దాని నుండి రసాన్ని తీయాలి. ఈ రసానికి తేనె కలిపి మూడు నుండి నాలుగు చుక్కల మోతాదులో ముక్కులో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఎక్కిళ్లు వెంటనే ఆగిపోతాయి.
గొంతు వాపును తగ్గించడంలో ఇప్ప పువ్వు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. గొంతు వాపు కారణంగా ఇబ్బంది పడుతున్నవారు ఇప్ప పువ్వును 3 గ్రాముల మోతాదులో నోట్లో వేసుకుని కొద్ది కొద్దిగా నమిలి మింగాలి. తరువాత నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల గొంతు వాపు తగ్గుతుంది. తలలో వచ్చే మురికి సర్పి కురుపులను తగ్గించడంలో ఇప్ప చెక్క పొడి మనకు ఎంతో దోహదపడుతుంది. ఇప్ప చెక్క పొడికి సమానంగా మిరియాల పొడిని కలపాలి. దీనికి నీటిని కలిపి మెత్తగా నూరాలి. ఈ మివ్రమాన్ని తలకు పట్టిస్తే తలలో వచ్చే మురికి సర్పి కురుపులు తగ్గుతాయి. పెదవులను అందంగా మార్చే గుణం కూడా ఇప్ప చెక్కకు ఉంది. ఇప్ప చెక్కను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి దంచి ఆరబెట్టాలి.
తరువాత ఈ పొడిని వస్త్రంలో వేసి జల్లించాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని మనకు కావల్సిన మోతాదులో తీసుకుని దానికి తగినంత నెయ్యిని కలిపి పెదవులకు రాసుకోవాలి. ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవుల పగుళ్లు, పెదవులపై ఉండే నలుపుతొలగిపోయి పెదవులు మృదువుగా, అందంగా మారతాయి. చర్మ రోగాలను హరించి వేయడంలో ఇప్పకాయలు మనకు ఎంతో దోహదపడతాయి. ఇప్పకాయలను దంచి పొడిగా చేయాలి. ఈ పొడిని చర్మ సమస్యలు ఉన్న చోట నలుగుగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా ఇప్ప చెట్టు మనకు మనకు ఎంతో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలను చాలా సులభంగా నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.