Menthi Pappu : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో మెంతులు కూడా ఒకటి. మెంతుల గురించి మనందరికి తెలిసిందే. వంటలల్లో, పచ్చళ్లల్లో వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. వంటల్లో వాడడంతో పాటు మెంతులను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బరువు తగ్గేలా చేయడంలో ఇలా అనేక రకాలుగా మెంతులు మనకు సహాయపడతాయి. మెంతులను పచ్చళ్లల్లో వాడడంతో పాటు వీటితో ఎంతో రుచిగా ఉండే పప్పును కూడా తయారు చేసుకోవచ్చు. మెంతి పప్పు చాలా రుచిగా ఉంటుంది. వంట రాని వారు కూడా ఈ పప్పును సులభంగా తయారు చేసుకోవచ్చు. మెంతులతో రుచిగా పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – అర కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్స్, మెంతులు – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 4, నీళ్లు – 2 కప్పులు, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మెంతి పప్పు తయారీ విధానం..
ముందుగా కళాయిలో కందిపప్పును వేసి దోరగా వేయించాలి. తరువాత వాటిని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు కుక్కర్ లో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక మెంతులు, ధనియాలు వేసి వేయించాలి. మెంతులు ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కడిగిన కందిపప్పు, నీళ్లు, పసుపు వేసి మూత పెట్టాలి. ఈ పప్పును మధ్యస్థ మంటపై 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి ఇందులో తగినంత ఉప్పు వేసి పప్పును మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు వేసి ఒక్కొక్కటిగా వేసి వేయించాలి.
తాళింపు చక్కగా వేగిన తరువాత ఉడికించుకున్న పప్పును వేసి కలపాలి. దీనిని మరో 3 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మెంతి పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మెంతులతో పప్పును తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.