Karachi Halwa : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో కరాచీ హల్వా కూడా ఒకటి. మనకు బయట షాపుల్లో కూడా ఈ హల్వా ప్యాకెట్స్ సులభంగా లభ్యమవుతాయి. ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ హల్వాను ఇష్టంగా తింటారు. స్పెషల్ డేస్ లో, పండుగలకు ఈ హల్వాను కొనుగోలు చేసి తింటూ ఉంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ కరాచీ హల్వాను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ కరాచీ హల్వాను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కరాచీ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
కార్న్ ఫ్తోర్ – ఒక కప్పు, పంచదార – 3 కప్పులు, నెయ్యి – ముప్పావు కప్పు, తరిగిన జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
కరాచీ హల్వా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో రెండు కప్పుల నీళ్లు పోసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత కళాయిలో పంచదారను తీసుకోవాలి. తరువాత ఇందులో 3 కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత మరో 10 నిమిషాల పాటు దీనిని మధ్యస్థ మంటపై ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత పంచదార పాకంలో ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న కార్న్ ఫ్లోర్ ను వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. కార్న్ ఫ్లోర్ మిశ్రమం దగ్గర పడిన తరువాత పావు కప్పు నెయ్యి వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించిన తరువాత ఫుడ్ కలర్ వేసి కలపాలి. తరువాత మరలా మిగిలిన నెయ్యి వేసి కలపాలి. ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమం నుండి నెయ్యి వేరయ్యే వరకు దీనిని చిన్న మంటపై బాగా ఉడికించాలి.
ఇలా నెయ్యి వేరవుతుండగా యాలకుల పొడి, జీడిపప్పు వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రేలో వేసి కలపాలి. దీనిని పైన సమానంగా చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత దీనిని ట్రే నుండి వేరు చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. మనకు కావాల్సిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరాచీ హల్వా తయారవుతుంది. ఈ హల్వాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే కరాచీ హల్వాను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు.