Ravva Aloo Masala : మనం ఉదయం పూట రవ్వతో రకరకాల బ్రేక్ ఫాస్ట్ లను తయారు చేస్తూ ఉంటాం. రవ్వతో చేసే బ్రేక్ ఫాస్ట్ లు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన అల్పాహారాల్లో రవ్వ ఆలూ బ్రేక్ ఫాస్ట్ కూడా ఒకటి. రవ్వతో చేసే ఈ బ్రేక్ ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. రవ్వ ఆలూ బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్ఠాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ ఆలూ బ్రేక్ ఫాస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – పావు కిలో, పెరుగు – అర కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రవ్వ ఆలూ బ్రేక్ ఫాస్ట్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రవ్వ, పెరుగు, ఉప్పు, అర కప్పు నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి.తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత రవ్వలో మరో పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. తరువాత స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక అందులో నూనె వేసి స్ప్రెడ్ చేయాలి. తరువాత ఇందులో గంటెతో రవ్వ మిశ్రమాన్ని తీసుకుని అట్టులా మందంగా వేసుకోవాలి.
తరువాత దీనిపై బంగాళాదుంప మిశ్రమాన్ని చెక్క లాగా వత్తుకుని ఉంచాలి. తరువాత దీనిపై మరి కొద్ది పిండిని వేసి బంగాళాదుంప మిశ్రమాన్ని మూసి వేయాలి. ఇప్పుడు దీనిపై మూతను ఉంచి చిన్న మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత దీనిని మరో వైపుకు తిప్పుకుని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. దీనిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే అల్పాహారాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా రవ్వతో బ్రేక్ ఫాస్ట్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.