Phirni : రంజాన్ మాసంలో ముస్లింలు ప్రత్యేకంగా చేసే తీపి పదార్థాల్లో ఫీర్ని కూడా ఒకటి. ఫీర్ని చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిని కలిగి ఉంటుంది ఈ ఫీర్ని. అయితే దీనిని ఎవరికి నచ్చిన పద్దతిలో వారు తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే ఫీర్ని కూడా చాలా రుచిగా ఉంటుంది. కేవలం ముస్లింలే కాకుండా దీనిని ఎవరైనా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, కమ్మగా ఉండే రంజాన్ స్పెషల్ ఫీర్నిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫీర్ని తయారీకి కావల్సిన పదార్థాలు..
గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – అర కప్పు, నెయ్యి – పావు కప్పు, చిక్కటి పాలు – ఒక లీటర్, పంచదార – ముప్పావు కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, కుంకుమ పువ్వు – చిటికెడు.
ఫీర్ని తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో నానబెట్టిన బాస్మతీ బియ్యాన్ని తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు పోయకుండా బియ్యాన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి పోసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక మిక్సీ పట్టుకున్న బియ్యం రవ్వ వేసి వేయించాలి. దీనిని ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత పాలు పోసి కలపాలి. ఈ పాలను కలుపుతూ సగం అయ్యే వరకు ఉడికించాలి. ఇలా పాలు సగం అయ్యాక పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి.
తరువాత దీనిని మరలా కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే ఫీర్ని మరీ చిక్కగా మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి. ఇలా ఉడికించిన ఫీర్నిని మట్టి పిడతలో లేదా స్టీల్ గిన్నెలల్లో వేసి ఫ్రిజ్ లో ఉంచాలి. ఫీర్ని చల్లగా అయిన తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఫీర్ని తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఎంతో ఉండే ఫీర్నిని తయారు చేసుకుని తినవచ్చు.