Street Style Egg Noodles : మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో లభించే పదార్థాల్లో ఎగ్ నూడుల్స్ కూడా ఒకటి. ఎగ్ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ నూడుల్స్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎగ్ నూడుల్స్ ను ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ నూడుల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూడుల్స్ – ఒక రోల్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, కోడిగుడ్లు – 4, క్యారెట్ తరుగు – పావు కప్పు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, క్యాప్సికం తరుగు – పావు కప్పు, క్యాబేజ్ తరుగు – పావు కప్పు, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ – కొద్దిగా.
ఎగ్ నూడుల్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఒక లీటర్ నీళ్లు, ఒక టీ స్పూన్ నూనె వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత నూడుల్స్ వేసి కలపాలి. ఈ నూడుల్స్ ను 80 శాతం ఉడికించిన తరువాత వాటిని వడకట్టి చల్లటి నీటితో కడిగి పక్కకు ఉంచాలి. తరువాత లోతుగా ఉండే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కోడిగుడ్లను బీట్ చేసి వేసుకోవాలి. ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని వేగే వరకు కదిలించకుండా అలాగే ఉంచాలి. కోడిగుడ్డు చక్కగా వేగిన తరువాత ముక్కలుగా చేసుకోవాలి. తరువాత కూరగాయ ముక్కలు, ఉప్పు వేసుకోవాలి.
వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉడికించిన నూడుల్స్ వేసి పెద్ద మంటపై 2 నిమిషాల పాటు టాస్ చేసుకోవాలి. తరువాత కారం, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తరువాత వెనిగర్, సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి మరో 2 నిమిషాల పాటు టాస్ చేసుకోవాలి. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ నూడుల్స్ తయారవుతాయి. సాయంత్రం సమయాల్లో ఇలా ఎగ్ నూడుల్స్ ను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.