Wheat Flour Burfi : గోధుమపిండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. గోధుమపిండితో చపాతీ, పూరీ, పుల్కా వంటి వాటినే కాకుండా తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. గోదుమపిండితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో గోధుమపిండి బర్ఫీ కూడా ఒకటి. గోధుమపిండితో చేసే ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఆరోగ్యానికి మేలు చేసే గోధుమపిండితో రుచిగా, కమ్మగా బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – అర కప్పు, పంచదార -ఒక కప్పు, బటర్ – 3 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – పావు టీ స్పూన్, ఫుడ్ కలర్ – చిటికెడు.
గోధుమపిండి బర్ఫీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. బటర్ కరిగిన తరువాత గోధుమపిండి వేసి వేయించాలి. గోధుమపిండిలో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. తరువాత మరో కళాయిలో పంచదార, ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. దీనిని తీగపాకం వచ్చే వరకు వేడి చేసిన తరువాత వేయించిన గోధుమపిండి, యాలకుల పొడి, ఫుడ్ కలర్ వేసి కలపాలి. దీనిని కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని కళాయికి అంటుకోకుండా దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ వేసిన టిన్ లోకి తీసుకుని పైన సమానంగా చేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి బర్ఫీ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా గోధుమపిండి బర్ఫీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.