Yakhni Pulao : ముస్లింల పెళ్లిళ్లల్లో ఎక్కువగా వడ్డించే చికెన్ వెరైటీలలో యఖ్ని పులావ్ కూడా ఒకటి. రంజాన్ మాసంలో కూడా ఈ పులావ్ ను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. యఖ్ని పులావ్ చాలా రుచిగా ఉంటుంది. యఖ్ని అంటే ఉర్దూలో సూప్ అని అర్థం. చికెన్ సూప్ తో చేసే ఈ పులావ్ తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఈ పులావ్ ను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ పులావ్ ను తేలికగా తయారు చేసుకోవచ్చు. లొట్ట లేసుకుంటూ తినేంత రుచిగా ఉండే ఈ పులావ్ ను సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యఖ్ని పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, నల్ల యాలక్కాయ – 1, అనాస పువ్వు – 1, లవంగాలు – 4, యాలకులు – 2, బిర్యానీ ఆకు – 1, సాజీరా – ఒక టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, అర గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ – అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒకటిన్నర కప్పు, ఎండిన దేశవాలీ గులాబీ రేకులు – ఒక టీ స్పూన్, రోజ్ వాటర్ – ఒక టీ స్పూన్.
సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒక లీటర్, చికెన్ బీన్స్ – 100 గ్రా., పసుపు – పావు టీ స్పూన్, యాలకులు – 2, లవంగాలు – 3, మిరియాలు – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, తరిగిన కొత్తిమీర – అర కట్ట.
యఖ్ని పులావ్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో సూప్ కు కావల్సిన పదార్థాలన్నీ వేసి 20 నుండి 25 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి సగానికి పైగా వేగిన తరువాత చికెన్ వేసి పెద్ద మంటపై 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న సూప్ ను ఒకటిన్నర కప్పు మోతాదులో వేసుకోవాలి.
తరువాత ఇందులో బాస్మతీ బియ్యం, గులాబీ రేకులు వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచిన తరువాత మూత తీసి రోజ్ వాటర్ వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే యఖ్నీ పులావ్ తయారవుతుంది. సాధారణంగా చేసే పులావ్ కంటే ఈ విధంగా చికెన్ సూప్ వేసి చేసే ఈ యఖ్ని పులావ్ మరింత రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.