Dal Paratha : మనం అల్పాహారంగా రకరకాల పదార్థాలను వండుకుని తింటూ ఉంటాం. వాటిలో గోధుమపిండితో చేసే పరాటాలు కూడా ఒకటి. పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మనం మన అభిరుచికి తగినట్టు వివిధ రుచుల్లో వీటిని తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన వివిధ రకాల పరాటాలలో దాల్ పరాటా కూడా ఒకటి. పప్పు వేసి చేసే ఈ పరాటా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. దాల్ పరాటాను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ దాల్ పరాటాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్ పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – 2 కప్పులు, నానబెట్టి మెత్తగా ఉడికించిన కందిపప్పు – ఒకటిన్నర కప్పు, వాము – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి -పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, అల్లం పేస్ట్ – అర టీ స్పూన్.
దాల్ పరాటా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో మెత్తగా చేసిన పప్పును వేసి కలపాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. తరువాత దీనిని పావు గంట పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. తరువాత దీనిని రెండు పక్కల మధ్యలోకి మడవాలి. తరువాత చతురస్రాకారంలో మడుచుకుని మరలా చపాతీలా వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పరోటాను వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి.
తరువాత నూనె వేస్తూ కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దాల్ పరాటా తయారవుతుంది. దీనిని పచ్చళ్లతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ పరాటా తయారీలో కందిపప్పుకు బదులుగా ఇతర పప్పులను కూడా ఉపయోగించవచ్చు. అలాగే రాత్రి మిగిలిన పప్పులో ఉండే తొక్కలను తీసేసి కూడా ఈ పరాటాను తయారు చేసుకోవచ్చు. ఈ పరాటాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.