Dumpling 65 : మనకు రెస్టారెంట్ లలో లభించే వివిధ రకాల ఆహార పదార్థాల్లో డంప్లింగ్ 65 కూడా ఒకటి. ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఇది అచ్చం మంచూరియాలాగా ఉంటుంది. కానీ దీనిని ఎటువంటి సాసెస్ వేయకుండా తయారు చేస్తారు. రెస్టారెంట్ లలో లభించే ఈ డంప్లింగ్ 65 ని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. అందరికి నచ్చేలా డంప్లింగ్ 65 ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డంప్లింగ్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా తరిగిన క్యాబేజ్ తురుము – 2 కప్పులు, క్యారెట్ తురుము – అర కప్పు, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఎండుమిర్చి -2, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, వెల్లుల్లి తరుగు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉల్లిపాయ తరుగు – ఒక టేబుల్ స్పూన్, పెరుగు- పావు కప్పు, ధనియాల పొడి – ముప్పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – ముప్పావు టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
డంప్లింగ్ 65 తయారీ విధానం..
ముందుగా గిన్నెలో క్యాబేజి తురుము, క్యారెట్ తురుము, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలపాలి. తరువాత మైదాపిండి, కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. దీనిలో నీళ్లు వేయకుండా క్యాబేజిని బాగా నలుపుతూ పిండిని కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉండలు వేసి వేయించాలి. వీటిని కరకరలాడుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు వేసి పెద్ద మంటపై వేయించాలి.
తరువాత కరివేపాకు, ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. తరువాత ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పెరుగు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అర నిమిషం పాటు వేయించిన తరువాత ముందుగా తయారు చేసుకున్న క్యాబేజి ఉండలను వేసి కలపాలి. వీటిని బాగా టాస్ చేసుకున్న తరువాత నిమ్మరసం, కొత్తిమీర వేసి మరోసారి టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డంప్లింగ్ 65 తయారవుతుంది. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి చాలా చక్కగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.