Bobbarlu Vadalu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో బొబ్బర్లు కూడా ఒకటి. బొబ్బర్లల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది బొబ్బర్లను ఉడికించి అలాగే మొలకెత్తించి తీసుకుంటూ ఉంటారు. కొందరూ వీటితో కూరను కూడా తయారు చేస్తారు. ఇవే కాకుండా ఈ బొబ్బర్లతో మనం ఎంతో రుచిగా ఉండే వడలను కూడా తయారు చేసుకోవచ్చు. బొబ్బర్లతో చేసే ఈ వడలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే ఈ బొబ్బర వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బొబ్బర వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
బొబ్బర్లు – ఒక కప్పు, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బొబ్బర వడల తయారీ విధానం..
ముందుగా బొబ్బర్లను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ పప్పును జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తగినంత పిండిని తీసుకుని వడలాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వడలను మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బొబ్బర వడలు తయారవుతాయి. వీటిని నేరుగా లేదా చట్నీలతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ వడలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.