Masala Dal : మనం వంటింట్లో తరచూ పప్పు కూరలను తయారు చేస్తూ ఉంటాం. పప్పు కూరలను తినడం వల్ల మన రుచితో పాటు మన శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. అయితే మనం ఏదో ఒక పప్పుతోనే కూరను తయారు చేస్తూ ఉంటాం. కానీ ఒకే రకం పప్పుతో కాకుండా వివిధ రకాల పప్పులను కలిపి కూడా మనం పప్పు కూరను తయారు చేసుకోవచ్చు. మసాలా పేస్ట్ వేసి చేసే ఈ పప్పు కూర చాలా రుచిగా ఉంటుంది. ధాబాలలో ఈ పప్పును ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే మసాలా దాల్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా దాల్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – పావు కప్పు, ఎర్ర కందిపప్పు – పావు కప్పు, మినపప్పు – పావు కప్పు, కందిపప్పు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, టమాట ముక్కలు – అర కప్పు, కొత్తిమీర – ఒక చిన్న కట్ట.
మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
వెల్లుల్లి రెబ్బలు – 3, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 4, అల్లం – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 2, మిరియాలు – అర టీ స్పూన్.
మసాలా దాల్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో పప్పులను వేసి శుభ్రంగా కడగాలి. తరువాత రెండున్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మసాలా పదార్థాలన్నింటిని జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద కళాయిని ఉంచి నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు పోయించాలి. తరువాత ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి.
టమాట ముక్కలు ఉడికిన తరువాత ఉడికించిన పప్పు, తగినన్ని నీళ్లు వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా దాల్ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.