Banana Muffins : మనకు బేకరీలల్లో లభించే పదార్థాల్లో బనానా మఫిన్స్ కూడా ఒకటి. మఫిన్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు వివిధ రుచుల్లో ఈ మఫిన్స్ లభిస్తూ ఉంటాయి. వాటిలో బనానా మపిన్స్ కూడా ఒకటి. బేకరీల్లో కొనుగోలు చేసే పని లేకుండా ఈ మఫిన్స్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. పిల్లలైనా వీటిని సులభంగా తయారు చేయవచ్చు. ఎంతో రుచిగా ఉండే బనానా మఫిన్స్ ను చాలా తేలికగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బనానా మఫిన్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, పంచదార పొడి – అర కప్పు, అరటి పండు – 1, నూనె – ఒక టేబుల్ స్పూన్, చాకో చిప్స్ – పావు కప్పు, తరిగిన వాల్ నట్స్ – 2 టీ స్పూన్స్, కాఫీ పొడి – 2 టీ స్పూన్స్, పాలు – అర కప్పు, వెనిగర్ – ఒక టీ స్పూన్, వంటసోడా – అర టీ స్పూన్, వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్.
బనానా మఫిన్స్ తయారీ విధానం..
ఒక గిన్నెలో మైదాపిండి, వంటసోడా, పంచదార పొడి, కాఫీ పొడి వేసి కలపాలి. తరువాత అరటిపండును మెత్తగా చేసి అర కప్పు మోతాదులో తీసుకోవాలి. ఇందులోనే వెనీలా ఎసెన్స్, నూనె వేసి కలపాలి. తరువాత పాలు, వెనిగర్ వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమానంతటిని మైదాపిండిలో వేసి కలపాలి. తరువాత వాల్ నట్స్, చాకో చిప్స్ వేసి కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని మౌల్డ్ లో వేసి సమానంగా చేసుకోవాలి. తరువాత ఒవెన్ ను ఆన్ చేసి 10 నిమిషాల పాటు బేకింగ్ మోడ్ లో ఉంచాలి. తరువాత మౌల్డ్ ను ఒవెన్ లో ఉంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. తరువాత బయటకు తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బనానా మఫిన్స్ తయారవుతాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే మఫిన్స్ ను తయారు చేసుకుని తినవచ్చు.