మన శరీరంలో రక్త కణాల సంఖ్య తగినంత ఉండాలి. అప్పుడే మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉండాలి. దీంతో శరీరంలోని భాగాలకు ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంది. ఇది శరీరం మొత్తానికి ఆక్సిజన్‌ను రవాణా చేస్తుంది. అలాగే ఊపిరితిత్తుల నుంచి కార్బన్ డయాక్సైడ్ ను బయటకు తీసుకెళ్తుంది.
శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే పలు రకాల క్రియలు సరిగ్గా నిర్వర్తింపబడవు. దీంతో అలసట, నీరసం, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. వైద్య పరీక్షలు చేయించుకుని అవసరం అయిన మేర మందులను వాడాలి. ఇక ఐరన్, విటమిన్ బి12 ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకునేందుకు ఈ కింది పదార్థాలను రోజూ తీసుకోవాలి.
1. పాలకూర
పాలకూరలో క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దీన్ని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలకూరలో ఐరన్, విటమిన్ సి ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పాలకూరను తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడమే కాదు, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
2. విత్తనాలు
అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు, చియా సీడ్స్ లో మెగ్నిషియం, ఐరన్, ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి.
3. బ్రొకొలి
బ్రొకొలిలో పోషకాలు అధికంగా ఉంటాయి. దీంట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీని వల్ల శరీరం ఐరన్‌ను ఎక్కువగా శోషించుకుంటుంది. అలాగే ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, కాల్షియం, సెలీనియం, మెగ్నిషియం లు అధికంగా ఉంటాయి. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. ఎముకలు దృఢంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
4. డార్క్ చాకొలెట్
డార్క్ చాకొలెట్‌లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే మెగ్నిషియం, ఐరన్‌లు కూడా ఉంటాయి. దీంతో వాపులు తగ్గుతాయి. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. చెడు (ఎల్‌డీఎల్) కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు.
5. కోడి గుడ్లు
కోడి గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్ డి, ఫోలేట్, అమైనో యాసిడ్లు, విటమిన్ బి12, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ లెవల్స్ పెరిగేందుకు దోహదపడతాయి. కండరాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365