మన శరీరానికి అవసరం అయిన అనేక రకాల పోషకాల్లో విటమిన్ డి ఒకటి. ఇది చాలా ముఖ్యమైన విటమిన్. అనేక రకాల జీవక్రియలను నిర్వహించేందుకు ఇది దోహదపడుతుంది. ఎముకలను దృఢంగా చేయడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ డి ఎంతగానో సహాయ పడుతుంది. అయితే చాలా మందికి విటమిన్ డి లోపం వస్తుంటుంది. ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చాలా మంది నిత్యం తగినంత సమయం సూర్యరశ్మిలో గడపడం లేదు. దీంతో విటమిన్ డి లోపం బారిన పడుతున్నారు. ఈ క్రమంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
శరీరంలో విటమిన్ డి లోపం వస్తే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది కనుక తరచూ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ఎప్పుడూ అలసటగా ఉంటుంది. నీరసంగా అనిపిస్తుంది. ఎముకలు, వెన్నెముక నొప్పిగా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన ఉంటాయి. డిప్రెషన్ బారిన పడతారు. గాయాలు, పుండ్లు త్వరగా మానవు. ఎముకలు బలహీనంగా మారి విరిగిపోయేందుకు అవకాశం ఉంటుంది. జుట్టు రాలుతుంది. కండరాల నొప్పులు ఉంటాయి. ఇవన్నీ విటమిన్ డి లోపం ఉందని తెలిపే లక్షణాలు. ఈ లక్షణాలు ఉంటే ఎవరైనా సరే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి విటమిన్ డి పరీక్ష చేయించుకోవాలి. తక్కువగా ఉందని తేలితే డాక్టర్ సూచన మేరకు విటమిన్ డి మందులను వాడాలి. అలాగే పలు రకాల ఆహారాలను తీసుకోవాలి. నిత్యం ఉదయం 20 నిమిషాల పాటు సూర్య రశ్మిలో గడపడం వల్ల కూడా మన శరీరంలో విటమిన్ డి తయారవుతుంది.
0 నుంచి 12 నెలల వయస్సు ఉన్నవారికి రోజుకు 400 ఐయూ వరకు విటమిన్ డి అవసరం. అదే 1 నుంచి 18 ఏళ్ల వారికి అయితే రోజుకు 600 ఐయూ, 19 నుంచి 70 ఏళ్ల వయస్సు వారికి కూడా 600 ఐయూ విటమిన్ డి అవసరం అవుతుంది. 70 ఏళ్లకు పైబడిన వారికి రోజుకు 800 ఐయూ విటమిన్ డి కావాలి. గర్భంతో ఉన్న మహిళలు లేదా పాలిచ్చే తల్లులకు కూడా రోజుకు 800 ఐయూ విటమిన్ డి కావాలి. విటమిన్ డి లోపం ఉంటే రోజుకు కావల్సిన మోతాదు ఇంకా పెరుగుతుంది. దాన్ని డాక్టర్ నిర్దారిస్తారు.
సాధారణంగా పిల్లల్లో విటమిన్ డి లోపం ఉంటే రోజుకు 1000 నుంచి 2500 ఐయూ వరకు విటమిన్ డి ఇస్తారు. అదే పెద్దలకు అయితే రోజుకు 4000 ఐయూ వరకు విటమిన్ డి ఇస్తారు. డాక్టర్ సూచన మేరకు కొన్ని రోజుల పాటు విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడాలి.
ఇక విటమిన్ డి మనకు ఎక్కువగా పాలు, చీజ్, పెరుగు, గుడ్లు, చేపలు, రొయ్యలు, పుట్ట గొడుగులు, పచ్చి బఠానీలు వంటి ఆహారాల్లో ఎక్కువగా లభిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవచ్చు.