Dal Halwa : హల్వా అనగానే మనకు స్వీట్ షాపుల్లో ఉండే నోరూరించే తియ్యని హల్వా గుర్తుకు వస్తుంది. దీన్ని వివిధ రకాల వెరైటీల్లో విక్రయిస్తుంటారు. అందులో వేసే పదార్థాలు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే కాస్త శ్రమించాలే కానీ హల్వాను చేయడం పెద్ద కష్టమేమీ కాదు. పెసర పప్పు లేదా మినప పప్పుతో దాల్ హల్వాను చాలా సులభంగా చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర పప్పు లేదా మినప పప్పు – 2 కప్పులు, నెయ్యి – 2 కప్పులు, చక్కెర – 1 కప్పు, మంచి నీళ్లు – 2 కప్పులు, యాలకులు – 6, కోవా – కప్పు, డ్రై ఫ్రూట్స్ – ఒక కప్పు.
దాల్ హల్వాను తయారు చేసే విధానం..
పెసర పప్పుని బాగా కడిగి ఓ రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పప్పుని మిక్సీలో వేసి నీళ్లు చల్లకుండా మెత్తగా రుబ్బాలి. ఒక గిన్నెలో చక్కెర, సరిపడా నీళ్లు పోసి పాకం పట్టాలి. మరీ ముదురుగా కాకుండా కాస్త తీగపాకం రానివ్వాలి. దించే ముందు ఇందులో యాలకుల పొడి వేసి కలిపి మూత పెట్టాలి. విడిగా ఓ బాణలిలో నెయ్యి వేసి కాగాక పెసర పప్పు ముద్ద వేసి బంగారు వర్ణంలోకి వచ్చే వరకు తిప్పుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం మంచి వాసన రావడంతోపాటు నెయ్యి బయటకు వస్తే ఉడికినట్లే. ఇప్పుడు కోవా కూడా వేసి బాగా కలిపి మరో మూడు నిమిషాలు ఉడికించాలి. తరువాత చక్కెర పాకం కలిపి ఆరేడు నిమిషాలు తిప్పుతూ ఉడికించాలి. చివరగా డ్రై ఫ్రూట్స్ వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించాలి. దీన్ని నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసి ఆరాక ముక్కలుగా కట్ చేయాలి. ఇష్టాన్ని బట్టి ఈ మిశ్రమంలో ఓ కప్పు వెనిలా ఐస్ క్రీమ్ కూడా కలుపుకోవచ్చు.