Egg Sherva : తక్కువ ధరలో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో కోడిగుడ్డు ఒకటి. దీనిలో ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయి. కోడిగుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కోడిగుడ్డుతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కోడిగుడ్డు షేర్వా కూడా ఒకటి. అన్నం, చపాతీ ఇలా దేనితో తిన్నా కూడా ఈ షేర్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. కోడిగుడ్లతో రుచిగా షేర్వాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్డు షేర్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 6, టమాట ముక్కలు – అర కప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, సోంపు – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 లేదా 3 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్,నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, కసూరి మెంతి – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు..
ఎండు కొబ్బరి ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పలుకులు – 8, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 4, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
కోడిగుడ్డు షేర్వా తయారీ విధానం..
ముందుగా జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో టమాట ముక్కలను కూడా వేసి మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, సోంపు గింజలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు టమాట పేస్ట్ వేసి వేయించాలి. టమాట పేస్ట్ కొద్దిగా వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్, కరివేపాకు కూడా వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి.
నీళ్లు కొద్దిగా ఉడుకుపట్టగానే ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టి వేసుకోవాలి. వీటిని మరో 7 నుండి8 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కసూరి మెంతి, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు షేర్వా తయారవుతుంది. ఈ షేర్వాను దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్డుతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడు ఇలా షేర్వాను కూడా తయారు చేసుకుని తినవచ్చు.