Jade Plant : మన ఇంటి ఆవరణలో సులభంగా పెంచుకోదగిన మొక్కలల్లో జేడ్ మొక్క కూడా ఒకటి. దీనినే జేడ్ మనీ ప్లాంట్, మనీ ట్రీ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క శాస్త్రీయనామం క్రాసులా ఒవాటా. ఈ మొక్కను మనం చాలా సులభంగా ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఈ మొక్కను పెంచడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. చిన్న కొమ్మను భూమిలో నాటితే చాలు ఈ మొక్క చెట్టులా పెరుగుతుంది. బయట నర్సరీలలో ఈ మొక్క మనకు చాలా సులభంగా లభ్యమవుతుంది. ఈ మొక్క పెరగడానికి ఎక్కువ నీరు కూడా అవసరం ఉండదు.
అయితే ఈ జేడ్ మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తూ ఉంటారు. చైనా దేశం వారు ఈ మొక్కను అదృష్టం, శ్రేయస్సు, సంపదలను ఇస్తుందని భావిస్తారు. సానుకూల శక్తిని, ఆర్థిక సమృద్దిని ఆహ్వానించడానికి ఈ మొక్కను ఎక్కువగా ఇళ్లల్లో, వ్యాపార సంస్థల్లో లోపలికి ప్రవేశించే దగ్గర ఉంచుతారు. అలాగే ఇతర ఇండోర్ మొక్కల వలె ఈ జేడ్ మొక్క కూడా గాలిని శుభ్రపరుస్తుంది. గాలిలో ఉండే కాలుష్యకారకాలను, విష వాయువులను గ్రహించి ప్రాణ వాయువును విడుదల చేస్తుంది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడంలో ఈ మొక్క మనకు ఎంతో సహాయపడుతుంది. జేడ్ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
అలాగే ఈ మొక్క ఆకుపచ్చటి ఆకులు, మందపాటి కాండం అదృష్టాన్ని, సంపదను సూచిస్తాయి. కనుక ఈ మొక్క ఎక్కువగా ఇతరులకు బహుమతిగా ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా గృహప్రవేశాలు చేసినప్పుడు, వ్యాపారం ప్రారంభించినప్పుడు ఈ మొక్కను బహుమతిగా ఇస్తూ ఉంటారు. అలాగే ఈ మొక్కలు చాలా కాలం పాటు జీవిస్తాయి. ఇవి తమ ఆకుల్లో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కనుక కరువు పరిస్థితులను కూడా సలుభంగా తట్టుకుంటాయి. ఈ జేడ్ ముక్కను మనం ఇంట్లో అలాగే ఇంటి బయట కూడా చాలా సులభంగా పెంచుకోవచ్చు. ఈ విధంగా జేడ్ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా రెండు విధాలుగా మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.