Tomato Roti Pachadi : మనం టమాటాలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. టమాటాలతో చేసే పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ పచ్చళ్లను ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఈ పచ్చళ్లను తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు కూడా టమాటాలతో పచ్చళ్లను సులభంగా తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా నువ్వులు వేసి టమాట రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట రోటి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – 3 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 12 నుండి 15, కరివేపాకు – రెండు రెమ్మలు, టమాటాలు – 5, చింతపండు – చిన్న ఉసిరికాయంత, జీలకర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8, ఉప్పు – తగినంత, కొత్తిమీర – గుప్పెడు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు, పసుపు – పావు టీ స్పూన్.
టమాట రోటి పచ్చడి తయారీ విధానం..
ముందుగా జార్ లో నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు వేగిన తరువాత వీటిని జార్ లో వేసి పొడిగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తరువాత ఇదే కళాయిలో టమాటాలు వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మూత తీసి చింతపండు వేసి కలపాలి. ఇప్పుడు మరలా మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రోట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర వేసి దంచుకోవాలి. తరువాతనువ్వుల పొడి వేసి దంచాలి. ఇప్పుడు ఉడికించిన టమాటలను వేసి దంచాలి. వీటిని మెత్తగా అయ్యే వరకు దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట రోటి పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రోలు అందుబాటులో లేని వారు దీనిని జార్ లో వేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన రోటి పచ్చడిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.