Street Dosa : మనం అల్పాహారంగా తీసుకునే వాటిల్లో దోశ కూడా ఒకటి. దోశను చాలా మంది ఇష్టంగా తింటారు. మనకు బయట బండ్ల మీద కూడా దోశలు లభిస్తూ ఉంటాయి. అలాగే మనం ఇంట్లో కూడా వీటిని విరివిరిగా తయారు చేస్తూ ఉంటాము. అయితే కొందరు ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికి బయట బండ్ల మీద లభించే విధంగా ఎర్రగా, కరకరలాడుతూ ఉండే దోశలను తయారు చేసుకోలేకపోతూ ఉంటాము. అలాంటి వారు కింద చెప్పిన విధంగా చేయడం వల్ల పలుచగా, ఎర్రగా, క్రిస్పీగా ఉండే దోశలను తయారు చేసుకోవచ్చు. బయట బండ్ల మీద లభించే విధంగా క్రిస్పీగా ఉండే దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
రేషన్ బియ్యం లేదా దోశల బియ్యం – 2 గ్లాసులు, మినపప్పు – పావు గ్లాస్, శనగపప్పు – పావు గ్లాస్, మెంతులు – ఒక టేబుల్ స్పూన్, దొడ్డు అటుకులు – పావు గ్లాస్, ఉప్పు – తగినంత, పంచదార – ఒక టేబుల్ స్పూన్, బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్స్.
దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం, మినపప్పు, శనగపప్పు, మెంతులు తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 7 గంటల పాటు నానబెట్టాలి. తరువాత పిండి పట్టడానికి 5 నిమిషాల పాటు అటుకులను నీటిలో వేసి నానబెట్టాలి. అటుకులు నానిన తరువాత వీటిని కూడా బియ్యంలో వేసి కలుపుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పిండినంతా మిక్సీ పట్టుకున్న తరువాత అంతా కలిసేలా మరోసారి కలుపుకుని మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. పిండిపులిసిన తరువాత దానిని ఒకే దిశలో అంతా కలిసేలా కలుపుకుని తగినంత పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో రవ్వ, పంచదార, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత ఈ పిండిని 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి.
ఇలా 10 నిమిషాల పాటు ఉంచిన తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నీటిని చల్లి టిష్యూతో లేదా కాటన్ వస్త్రంతో తుడవాలి. తరువాత మంటను చిన్నగా చేసి తగినంత పిండిని తీసుకుని పలుచగా దోశలాగా వేసుకోవాలి. తరువాత మంటనే మధ్యస్థంగా చేసి దోశ తడి ఆరిన తరువాత నూనె వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే దోశ తయారవుతుంది. దీనిని చట్నీలో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల అచ్చం బండ్ల మీద లభించే క్రిస్పీ దోశను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.