Jaggery Powder : బెల్లం.. తీపి వంటకాల తయారీలో దీనిని మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. బెల్లంతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే బెల్లాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బెల్లంలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో మలినాలు తొలగిపోతాయి. శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారు బెల్లాన్ని తినడం వల్లమంచి ఫలితం ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో, శరీరంలో జీవక్రియల రేటును పెంచడంలో ఇలా అనేక విధాలుగా బెల్లం మనకు సహాయపడుతుంది.
రోజూ ఒక ముక్క బెల్లాన్ని నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే మనకు మార్కెట్ లో బెల్లం గడ్డల రూపంలో లభిస్తుంది. కొంతమంది ఈ బెల్లాన్ని కొనుగోలు చేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేస్తూ ఉంటారు. దీంతో బెల్లం మరింత గట్టి పడుతుంది. గట్టిపడిన ఈ బెల్లాన్ని తురుముకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. అయితే బెల్లాన్ని పగలకొట్టకుండా ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల ఒంటి చేత్తోనే బెల్లాన్ని పొడిగా చేసుకోవచ్చు. బెల్లాన్ని పొడిగా చేసే ఈ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక కుక్కర్ లో అడుగును ఇసుకను పోసి వేడి చేయాలి. ఇందులో ఇసుకకు బదులుగా ఉప్పును కూడా వేసుకోవచ్చు. ఇసుక వేడయ్యాక అందులో స్టాండ్ ను ఉంచాలి.
తరువాత ఒక గిన్నెలో బెల్లం దిమ్మెను తీసుకుని స్టాండ్ మీద ఉంచాలి. తరువాత దీనిపై మూత పెట్టి చిన్నమంటపై 10 నుండి 15 నిమిషాల పాటు వేడి చేయాలి. ఇలా వేడి చేసిన తరువాత బెల్లం దిమ్మెను నెమ్మదిగా బయటకు తీసి ప్లేట్ లో వేసుకోవాలి. తరువాత చాకుతో బెల్లాన్ని తురుముకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా సులభంగా మనం బెల్లం తురుమును తయారు చేసుకోవచ్చు. ఈ తురుమును ఫ్యాన్ గాలి కింద 2 నుండి 3 గంటల పాటు ఉంచడం వల్ల పొడి పొడిగా తయారవుతుంది. ఇలా తయారైన బెల్లం పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకుని ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లోనే బెల్లం పొడిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.