Badusha : మనకు స్వీట్ షాపుల్లో లభించే వివిధ రకాల తీపి వంటకాల్లో బాదుషా కూడా ఒకటి. బాదుషా లోపల మెత్తగా పైన క్రిస్పీగా గుల్ల గుల్లగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది ఈ బాదుషాలను ఇంట్లో తయారు చేసుకోవడం వీలుపడదు అని భావిస్తూ ఉంటారు. కానీ గుల్ల గుల్లగా జ్యూసీగా ఉండే ఈ బాదుషాలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కేవలం నిమిషాల వ్యవధిలోనే రుచికరమైన బాదుషాలను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో రుచిగా, గుల్లగుల్లగా, సులభంగా బాదుషాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదుషా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – 2 కప్పులు, ఉప్పు – చిటికెడు, బేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూన్, కరిగించిన నెయ్యి – అర కప్పు, నీళ్లు – అర కప్పు, పంచదార – 2 కప్పులు, కుంకుమ పువ్వు – చిటికెడు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బాదుషా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తరువాత నెయ్యి వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ పిండిని చేత్తో వత్తుతూ మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో పంచదార, ఒక కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత కుంకుమ పువ్వు వేసి కలపాలి. తరువాత దీనిని మధ్యస్థ మంటపై లేత తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. పంచదార పాకం సిద్దంకాగానే యాలకుల పొడి వేసి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పిండిని మరోసారి కలుపుకోవాలి.
తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ముందుగా రెండు చేతులతో గుండ్రంగా చేసుకోవాలి. తరువాత ఈ ముద్దను రెండో చేతుల మధ్య ఉంచి బాదుషా ఆకారంలో వత్తుకోవాలి. తరువాత బొటన వేలుతో రంధ్రం చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడయ్యాక తగినన్ని బాదుషాలను వేసుకోవాలి. కొద్ది సమయానికి బాదుషాలు పైకి తేలుతాయి. ఇలా బాదుషాలు పైకి తేలగానే మంటను మధ్యస్థంగా చేసి బాదుషాలను అటూ ఇటూ తిప్పుతూ కాల్చుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రైన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
తరువాత వీటిని నూనె నుండి తీసి పంచదార పాకంలో వేసుకోవాలి. వీటిని రెండు నుండి మూడు నిమిషాల పాటు పంచదార పాకాన్ని చక్కగా పీల్చుకునేలా అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి. తరువాత పాకం నుండి తీసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, జ్యూసీగా, గుల్ల గుల్లగా ఉండే బాదుషాలు తయారవుతాయి. పండుగలకు, ప్రత్యేక సందర్భాల్లో ఇలా ఇంట్లోనే రుచిగా, కమ్మటి బాదుషాలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.