Street Style Tea : టీ.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చాలా మంది ఎంతో ఇష్టంగా టీ ని తాగుతూ ఉంటారు. టీ ని తాగడం వల్ల శరీరబడలిక తగ్గుతుంది. ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. టీ ని తయారు చేసే విధానం మనందరికి తెలిసిందే. కానీ ఈ టీ ని మరింత రుచిగా, మరింత కమ్మగా స్ట్రీల్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 2 కప్పులు, దంచిన అల్లం – 2 అంగుళాలు, దంచిన యాలకులు – 4, లవంగాలు – 4, దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క, పంచదార – 3 టేబుల్ స్పూన్స్, టీ పొడి – 2 టేబుల్ స్పూన్స్, వేడి పాలు – 2 కప్పులు, గులాబి రేకులు – ఒక టీ స్పూన్.
టీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని పోసుకోవాలి. తరువాత ఇందులో అల్లం, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. తరువాత పంచదార, టీ పొడి వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒకటిన్నర కప్పు డికాషన్ అయ్యే వరకు మరిగించాలి. తరువాత పాలు పోసుకోవాలి. తరువాత గులాబి రేకులు వేసి గంటెతో పై నుండి కిందికి టీ ని పోస్తూ కలుపుతూ మరిగించాలి. ఇలా 2 నుండి 3 పొంగులు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత టీ ని వడకట్టి కప్పులో పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, కమ్మగా, చక్కటి వాసనతో ఉండే టీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.