Wheat Flour Cake : గోధుమపిండితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. గోధుమపిండితో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. గోధుమపిండితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో గోధుమపిండి కేక్ కూడా ఒకటి. ఈ కేక్ చాలా రుచిగా, స్పాంజిలాగా ఉంటుంది. సాధారణంగా కేక్ ను ఎక్కువగా మైదాపిండితో తయారు చేస్తారు. మైదాపిండితో చేసే కేక్ ను తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. కానీ గోధుమపిండితో చేసే కేక్ ను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే ఇంట్లో ఒవెన్ లేకపోయినా కూడా మనం కేక్ ను తయారు చేసుకోవచ్చు. ఒవెన్ తో పని లేకుండా స్పాంజి లాంటి గోధుమపిండి కేక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోదుమపిండి కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, పంచదార పొడి – ఒక కప్పు, పెరుగు – అర కప్పు, నూనె – అర కప్పు, పాలు – ముప్పావు కప్పు, బేకింగ్ పౌడర్ – ముప్పావు టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్.
గోధుమపిండి కేక్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పంచదార పొడిని తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, నూనె వేసి బాగా కలపాలి. తరువాత గోధుమపిండి, వంటసోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా పాలు పోస్తూ కలుపుకోవాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత వెనీలా ఎసెన్స్ వేసి కలపాలి. తరువాత తరిగిన డ్రై ఫ్రూట్స్ ను వేసి కలపాలి. ఇప్పుడు కేక్ గిన్నెను తీసుకుని దానికి నెయ్యిని రాయాలి. తరువాత గోధుమపిండిని చల్లుకోవాలి. ఇప్పుడు ఇందులో కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. దీనిలో బుడగలు లేకుండా గిన్నెను తట్టాలి. తరువాత కళాయిలో రెండు కప్పుల ఉప్పు వేసి సమానంగా చేసుకోవాలి.
తరువాత మూత పెట్టి పెద్ద మంటపై 5 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత కేక్ గిన్నెను ఉంచి మూత పెట్టి చిన్న మంటపై 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత టూత్ పిక్ ను తీసుకుని కేక్ మధ్యలో గుచ్చి చూడాలి. టూత్ పిక్ కు ఏమి అంటుకోకుండా వస్తే కేక్ ఉడికినట్టుగా భావించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెను బయటకు తీసి కొద్దిగా చల్లారనివ్వాలి. తరువాత చాకుతో అంచులను వేరు చేసి కేక్ ను గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కావల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, మెత్తగా ఉండే గోధుమపిండి కేక్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.