మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు తగినన్ని గంటల పాటు నిద్రించాలి. ప్రతి మనిషికి రోజూ కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. వృద్ధులు, చిన్నారులకు అయితే 10 గంటల నిద్ర అవసరం. అయితే ప్రస్తుతం చాలా మంది అనుభవిస్తున్న బిజీ లైఫ్ కారణంగా రాత్రిపూట ఆలస్యంగా నిద్రిస్తున్నారు. ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించడం లేదు. అయితే రోజూ సరిగ్గా నిద్రించకపోతే ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించకపోతే ఆ ప్రభావం నాడీ మండల వ్యవస్థపై పడుతుంది. దీంతో ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. డిప్రెషన్ బాగా పెరిగితే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి.
2. రోజూ తగినంత నిద్ర పోకపోతే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. శరీరం వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లకు నిలయంగా మారుతుంది. అనారోగ్య సమస్యలు ఎప్పుడూ వస్తుంటాయి. ఒక పట్టాన అవి తగ్గవు.
3. నిద్ర సరిగ్గా పోకపోతే డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధికంగా బరువు పెరుగుతారు. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
4. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించని వారికి తరచూ శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. తరచూ దగ్గు, జలుబు బారిన పడుతుంటారని సైంటిస్టులు తమ అధ్యయనాల్లో వెల్లడించారు.
5. రోజూ తగినంత నిద్రలేకపోతే జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీని వల్ల మలబద్దకం, గ్యాస్ వస్తాయి.
6. రోజూ తగినంత నిద్ర లభించకపోతే ఎండోక్రైన్ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీని వల్ల అనేక రకాల గ్రంథుల పనితీరు మందగిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత నెలకొంటుంది.
కనుక రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర అయినా ఉండేలా చూసుకోవాలి. రాత్రి పూట గ్యాడ్జెట్ల వాడకాన్ని తగ్గించాలి. త్వరగా భోజనం చేసి త్వరగా నిద్రించాలి. దీని వల్ల తగినన్ని గంటల పాటు నిద్రించవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365