ఈ మధ్య కాలంలో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువైంది. అందుకే జనాలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చేయాల్సినందతా చేస్తున్నారు. ఇది ఓకే. అయితే ఇలా చేసే క్రమంలో కొందరు ఆరోగ్యానికి సంబంధించిన కథనాలను చదువుతూ ఉంటారు. ఈ క్రమంలో అలాంటి కథనాల్లో కొన్ని పదాలు మనకు తరచూ తారసపడుతుంటాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అయితే మనకు రెగ్యులర్‌గా ఆర్టికల్స్‌లో కనిపించే ఆరోగ్యానికి చెందిన ఆ పదాలు ఏవో, వాటి వల్ల మనకు ఏం తెలుస్తుందో ఇప్పుడు చూద్దాం. న్యూట్రిషన్.. న్యూట్రిషన్ అంటే షౌష్టికాహారం. అంటే విటమిన్లు, మినరల్స్, మాంసకృత్తులు (ప్రోటీన్లు), పిండిపదార్థాలు (కార్బొహైడ్రేట్స్), ఫ్యాట్స్ (కొవ్వులు) కలిగిన ఆహారం అన్నమాట. వీటిని పోషకాలు అంటారు. ఇలాంటి ఆహారం తింటేనే మనకు పోషణ సరిగ్గా అందుతుంది. దీంతో అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు. మీకు తెలుసా..? మనకు వచ్చే వ్యాధుల్లో కొన్ని మాత్రం పోషకాహారం తినకపోవడం వల్లే వస్తాయి. కనుక ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ అనేది తప్పనిసరి.
ట్రాన్స్‌ఫ్యాట్స్.. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. పాలు, పెరుగు వంటి వాటిల్లో ఉండే ట్రాన్స్‌ఫ్యాట్స్ మంచివి. ఇవి మన శరీరానికి మంచి చేస్తాయి. అదే బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌లలో మరో రకమైన ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మంచిది కాదు. కనుక వాటిని తినరాదు. యాంటీ ఆక్సిడెంట్స్.. గ్రీన్ టీ, యాపిల్, కివీ, దానిమ్మ వంటి అనేక రకాల పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల బారి నుంచి రక్షణ లభిస్తుంది. కనుక యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తింటే తద్వారా రోగాలు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాదు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ట్రై గ్లిజరైడ్స్.. ఇవి కొవ్వుల్లో ఒక రకానికి చెందుతాయి. మనం తినే ఆహారం నుంచి శరీరం వీటిని తయారు చేసుకుంటుంది. అత్యంత క్లిష్టతర పరిస్థితుల్లో శరీరానికి ఏ రకంగానూ శక్తి అందదు అనుకుంటే తప్ప ఇవి విడుదల కావు. వీటి ద్వారా శరీరానికి డైరెక్ట్‌గా ఎనర్జీ అందుతుంది. ఇవి శరీరంలో మోతాదుకు మించి మాత్రం ఉండరాదు. ఉంటే గుండె జబ్బులు వస్తాయి.
కొలెస్ట్రాల్.. కొలెస్ట్రాల్ కూడా ఓ రకమైన కొవ్వు పదార్థమే. కాకపోతే ఇందులో రెండు రకాలు ఉంటాయి. హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అని ఉంటాయి. హెచ్‌డీఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్. ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండరాదు. ఉంటే ప్రమాదం. ఎలక్ట్రోలైట్స్.. సోడియం, పొటాషియం, క్లోరైడ్, మెగ్నిషియం, పాస్ఫరస్ వంటి వాటిని ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఇవి శరీరంలో తగిన మోతాదులో ఉండాలి. లేకపోతే వికారంగా ఉంటుంది. తల తిరుగుతుంది. డీ హైడ్రేషన్ సమస్య వస్తుంది. స్పృహ కోల్పోతారు. కొబ్బరి బొండాలు వంటివి తాగితే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఫ్లేవనాయిడ్స్.. ఇవి ఓ రకమైన యాంటీ ఆక్సిడెంట్లు. పైన చెప్పినట్టుగా ఇవి కూడా మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధుల నుంచి రక్షిస్తాయి. గ్రీన్ టీ, కివీలు, దానిమ్మ వంటి పండ్లలో ఇవి ఉంటాయి.
గ్లైసీమిక్ ఇండెక్స్.. మనం ఆహారంగా తినే అనేక పదార్థాల్లో కార్బొహైడ్రేట్లు ఉంటాయి కదా. అవి శరీరంలోకి వెళ్లే సరికి గ్లూకోజ్‌గా మారుతాయి. ఈ క్రమంలో కొన్ని ఆహార పదార్థాలు తినగానే వెంటనే గ్లూకోజ్‌గా మారుతాయి. కొన్ని అలా కావు. నిదానంగా గ్లూకోజ్ గా మారుతాయి. అయితే అలా మారే రేటునే గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు. ఈ ఇండెక్స్ ఎంత తక్కువగా ఉంటే ఆ ఆహారం అంత నెమ్మదిగా గ్లూకోజ్‌గా మారుతుందన్నమాట. ఇది మధుమేహం ఉన్న వారికి మేలు చేస్తుంది. వారు గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే తద్వారా అది గ్లూకోజ్‌గా వేగంగా మారదు. దీంతో వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
ఫ్యాటీ యాసిడ్లు.. ఇవి కూడా ఓ రకమైన కొవ్వుల జాతికే చెందుతాయి. అయితే వీటిలో పలు రకాలు ఉంటాయి. మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్లు అని ఉంటాయి. అయితే మన శరీరానికి మోనో, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్లు మంచి చేస్తాయి. కానీ వీటిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకోకూడదు. చేపలు, లివర్, నట్స్, అవకాడో, ఆలివ్ ఆయిల్ వంటి వాటిల్లో ఇవి ఉంటాయి. గ్లూటెన్.. ఇది ఓ రకమైన ప్రోటీన్. గోధుమ, రై, బార్లీ వంటి గింజల్లో ఎక్కువగా ఉంటుంది. అయితే దీని వల్ల అనారోగ్యాలు వస్తున్నాయని ఈ మధ్య కాలంలోనే సైంటిస్టులు గుర్తించారు. దీంతో గ్లూటెన్ ఫ్రీ పుడ్‌ను చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. అలాంటి ఆహారం తింటే బరువు త్వరగా తగ్గవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.