Tomatoes : మనం టమాటాలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. టమాటాలల్లో కూడా అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక విధాలుగా టమాటాలు మనకు దోహదపడతాయి. టమాటాలతో మనం రకరకాల కూరలను, పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. వీటిని ఫ్యూరీలాగా చేసి కూడా అనేక రకాల మసాలా వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అసలు చెప్పాలంటే టమాటాలు లేని వంటగది ఉండదనే చెప్పవచ్చు. చాలా మంది టమాటాలు లేనిదే ఏ వంట చేయలేరు. అంత ఇదిగా టమాటాలు మన వంట్లలో భాగమైపోయాయి. కానీ ప్రస్తుత కాలంలో కిలో టమాటాల ధర 100 రూపాయలు దాటింది. టమాటాలను దొంగతనం చేసే పరిస్థితి నెలకొంది.
చాలా మంది పేదలు, మద్య తరగతి వారు టమాటలు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది వంటల్లో టమాటాలకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. కొన్ని రకాల ఇతర పదార్థాలను వాడడం వల్ల మనం వంటల్లో టమాట రుచిని భర్తీ చేయవచ్చు. ఇవి టమాటాల కంటే చాలా తక్కువ ధరలో లభిస్తాయి. ఇవి అన్ని కూడా సహజ సిద్దమైనవే. టమాటాలకు బదులుగా వాడుకోదగిన ఇతర పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పచ్చి మామిడికాయలను మనం టమాటాలకు బదులుగా వంటల్లో వాడుకోవచ్చు. పచ్చి మామిడికాయలు కూడా పుల్లటి రుచిని కలిగి ఉంటాయి.
ఇవి కూడా కూరలకు చక్కటి రుచిని అందిస్తాయి. అలాగే ఇవి మనకు తక్కువ ధరలోనే లభిస్తాయి. కనుక మనం టమాటాలకు బదులుగా పచ్చి మామిడికాయలను వంటల్లో సులభంగా వాడుకోవచ్చు. అలాగే మనం టమాటాలకు బదులుగా చట్నీలల్లో చింతపండును వాడుకోవచ్చు. చింతపండు కూడా పుల్లటి రుచిని కలిగి ఉంటుంది. చింతపండు ధర ఎక్కువైనప్పటికి నేటి కాలంలో టమాటాల కంటే తక్కువ ధరలోనే చింతపండు లభిస్తుంది. కనుక మనం టమాటాలకు బదులుగా వంటల్లో, చట్నీల తయారీలో చింతపండు గుజ్జును పులుపు కొరకు వాడుకోవచ్చు. అలాగే టమాట వంటి పుల్లటి రుచిని కలిగి ఉండే మరో పదార్థం ఉసిరికాయ. ఉసిరికాయ పుల్లగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
వంటల్లో పుల్లటి రుచి కొరకు మనం టమాటాలకు బదులుగా ఉసిరికాయలను వాడడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే వంటల్లో మనం టమాటాలకు బదులుగా సొరకాయను, గుమ్మడికాయను కూడా వాడుకోవచ్చు. ఇవి వంటలకు రుచిని ఇవ్వడంతో పాటు కూరలో గ్రేవీ ఎక్కువగా ఉండేలా చేయడంలో సహాయపడతాయి. అలాగే మనం టమాటాలకు బదులుగా పుల్లటి రుచి కొరకు ఆమ్ చూర్ పొడిని కూడా ఉపయోగించుకోవచ్చు. దీనిని వాడడం వల్ల కూరలకు టమాట రుచి రావడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అధికంగా డబ్బును వెచ్చించి టమాటాలను కొనుగోలు చేసే బదులు వాటికి ప్రత్యామ్నాయంగా ఈ పదార్థాలను వాడుకోవడం మంచిది.