Conjunctivitis : ప్రస్తుతం మనలో చాలా మంది కండ్లకలక సమస్యతో బాధపడుతున్నారు. కండ్లకలకతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. వైరల్ ఇన్పెక్షన్ కారణంగా తలెత్తే ఈ సమస్య వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. కండ్లకలక వల్ల కళ్లు ఎర్రగా మారతాయి. కండ్ల నుండి నీరు ఎక్కువగా కారుతుంది. కళ్లు ఉబ్బినట్టుగా ఉంటాయి. అలాగే కళ్లల్లో దురద, మంటలు ఎక్కువగా ఉంటాయి. కళ్ల నుండి పుసి ఎక్కువగా రావడం, కళ్లు తెరవలేకపోవడం, కళ్లు మసకగా కనబడడం వంటి వాటిని కండ్లకలక యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. అలాగే ఈ సమస్యను మనం అంటు వ్యాధిగా చెప్పవచ్చు.
అయితే చాలా మంది కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే కండ్లకలక వస్తుందని భావిస్తారు. కానీ కండ్లకలక స్పర్శ ద్వారా వస్తుంది. కండ్లకలక వచ్చిన వారు వాడిన వస్తువులను, దుస్తులను వాడడం వల్ల ఇది ఒకరి నుండి మరొకరికి వస్తుంది. కంటి చుక్కలు వాడడం వల్ల మనం తక్షణ ఉపశమనం వచ్చినప్పటికి ఇది పూర్తిగా తగ్గడానికి వారం నుండి రెండు వారాల సమయం పడుతుంది. కండ్లకలక వల్ల ప్రాణనష్టం జరగనప్పటికి తీవ్రమైన సందర్భాలలో మాత్రమే కంటిచూపు పోయే ప్రమాదం ఉంది. అయితే కొన్ని రకాల జాగ్రత్తలు, చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుండి త్వరగా బయటపడడంతో పాటు ఒకరినుండి మరొకరికి రాకుండా అడ్డుకోవచ్చు.
కండ్లకలకతో బాధపడే వారు కాంటాక్ట్ లెన్సులను వాడడం మానేయాలి. కంటికి అలంకరణలు చేయకూడదు. అలాగే గోరు వెచ్చని నీటిలో శుభ్రమైన వస్త్రాన్ని ముంచి నీటిని పిండి వేయాలి. తరువాత ఈ వస్త్రాన్ని కండ్లపై ఉంచుకోవాలి. ఇది చల్లారిన తరువాత తీసి మరలా వేడి నీటిలో ముంచి కళ్లపై వేసుకోవాలి. ఇలా 10నుండి 15 సార్లు చేయాలి. అదే విధంగా కండ్లకలక ఇతరులకు రాకుండా చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే మురికి చేతులతో కళ్లను తాకడం, కళ్లను రుద్దడం వంటివి చేయకూడదు. అలాగే ఇతరులతో కనీస దూరం పాటించాలి. అలాగే కళ్లదాలు, కాంటాక్ట్ లెన్సులు వంటి వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈవిధంగా ఈ చిట్కాలను, జాగ్రత్తలను పాటించడం వల్ల కండ్లకలక తగ్గడంతో పాటు రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.