Instant Rice Flour Dosa : మనం బియ్యం పిండితో రకరకాల పిండి వంటకాలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసే వంటకాలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. కేవలం చిరుతిళ్లు మాత్రమే కాకుండా బియ్యం పిండితో మనం ఎంతో రుచిగా ఉండే దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ దోశలు మెత్తగా, చాలా రుచిగా ఉంటాయి. వీటిని కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. బియ్యం పిండి ఉంటే చాలు వీటిని చిటికెలో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ బియ్యం పిండి దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక కప్పు, పెరుగు – ఒక కప్పు, నీళ్లు – ముప్పావు కప్పు, ఉప్పు – తగినంత.

ఇన్ స్టాంట్ బియ్యం పిండి దోశ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో బియ్యం పిండి, పెరుగు, అర కప్పు నీళ్లు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని దోశ పిండి కంటే కొద్దిగా పలుచగా ఉండేలా నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి టిష్యూ పేపర్ తో తుడుచుకోవాలి. తరువాత పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి. ఈ దోశను ఊతప్పం మాదిరి వేసుకోవాలి. తరువాత అంచుల చుట్టూ నూనె వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత మరో వైపుకు తిప్పి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో బియ్యం పిండి దోశ తయారవుతుంది. దీనిని ఆవకాయ, టమాట పచ్చడి వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఏ టిఫిన్ చేయాలో తోచనప్పుడు ఇలా బియ్యం పిండితో రుచికరమైన దోశలను తయారు చేసుకుని తినవచ్చు.