Instant Tomato Dosa : మనలో చాలా మంది దోశలను ఇష్టంగా తింటారు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన దోశలల్లో టమాటదోశ కూడా ఒకటి. ఈ దోశ చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. పప్పు నానబెట్టే అవసరం లేకుండా ఇన్ స్టాంట్ గా ఈ దోశను తయారు చేసుకోవచ్చు. ఎవరైనా ఈ దోశను చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఇన్ స్టాంట్ టమాట దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ టమాట దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాట ముక్కలు – ఒక కప్పు, ఎండుమిర్చి – 3, అల్లం – ఒక ఇంచు ముక్క, బొంబాయి రవ్వ – అరకప్పు, గోధుమపిండి – పావు కప్పు, బియ్యం పిండి – అర కప్పు, జీలకర్ర – అర టీస్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1.
ఇన్ స్టాంట్ టమాట దోశ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో టమాట ముక్కలు, ఎండుమిర్చి, అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో గోధుమపిండి, బియ్యంపిండి, రవ్వను వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లను పోసుకుంటూ రవ్వ దోశ మాదిరి పిండిని పలుచగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. పిండి నానిన తరువాత అవసరమైతే మరికొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి.
పెనం వేడయ్యాక నూనె వేసి టిష్యూతో లేదా ఉల్లిపాయతో రుద్దాలి. తరువాత పిండిని తీసుకుని రవ్వ దోశలాగా వేసుకోవాలి. దోశ తడి ఆరిన తరువాత నూనె వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట దోశ తయారవుతుంది. దీనిని కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నవారు, కొత్త రుచులను కోరుకునే వారు ఇలా టమాట దోశను తయారు చేసుకుని తినవచ్చు.