Pesara Muttilu : పెసర ముట్టీలు.. పెసరపప్పుతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా పూర్వకాలంలో తయారు చేసే వారు. ఈ ముట్టీలను తయారు చేయడానికి ఒక్క చుక్క నూనె కూడా అవసరం ఉండదు. ఆవిరి మీద ఉడికించి చేసే ఈ ముట్టీలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పెసర ముట్టీలను తయారు చేయడం చాలా సులభం. వీటిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ ముట్టీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర ముట్టీలు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – ఒక కప్పు, శనగపప్పు – పావు కప్పు, పచ్చిమిర్చి – 2, అల్లం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, వంటసోడా – రెండు చిటికెలు, నూనె – ఒక స్పూన్, తాళింపు దినుసులు – ఒఎక టీ స్పూన్స్, నువ్వులు – అర టీ స్పూన్, జీడిపప్పు – కొద్దిగా, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – చిటికెడు, పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు, కారం – ఒక టీ స్పూన్, బటర్ – ఒక టీ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – ఒక టీ స్పూన్.
పెసర ముట్టీల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పు, శనగపప్పు వేసి నానబెట్టాలి. పప్పు నానిన తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పిండిని గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, జీలకర్ర, వంటసోడా వేసి కలపాలి. తరువాత ఈ పిండిని 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని పోయాలి. తరువాత ఇందులో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యే లోపు ఒక ప్లేట్ ను తీసుకుని దానిపై అరటి ఆకును ఉంచాలి. ఈ అరటి ఆకుపై ముందుగా తయారు చేసుకున్న పిండిని పునుగుల వలె వేసుకోవాలి. తరువాత ఈ ప్లేట్ ను స్టాండ్ పై ఉంచి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత ప్లేట్ ను బయటకు తీసి ముట్టీలను గిన్నెలో వేసుకోవాలి. ఈ ముట్టీలను ఇలాగే చట్నీతో తినవచ్చు. లేదంటే వీటిని తాళింపు వేసుకుని కూడా తినవచ్చు. ఇందుకోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, జీడిపప్పు, ఇంగువ, కరివేపాకు, నువ్వులు వేసి వేయించాలి. తరువాత పసుపు, పచ్చి కొబ్బరి తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం వేసి కలపాలి. ఇప్పుడు ముట్టీలను వేసి కలపాలి. తరువాత బటర్, కొత్తిమీర నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసర ముట్టీలు తయారవుతాయి. వీటిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా ముట్టీలను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.