Mysore Style Rasam : మనం వంటింట్లో అప్పుడప్పుడూ రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాము. రసం చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాలతో కలిపి తింటే రసం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది రసంతో కడుపు నిండుగా భోజనం చేస్తారనే చెప్పవచ్చు. అయితే ఈ రసాన్ని మనం మరింత రుచిగా మైసూర్ స్టైల్ లో కూడా తయారు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా చేసిన మసాలాతో తయారు చేసే ఈ రసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పుల్ల పుల్లగా కారంగా ఉండే మైసూర్ స్టైల్ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మైసూర్ స్టైల్ రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 స్పూన్స్, శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు -ఒక టీ స్పూన్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు -ఒక రెమ్మ, పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు, టమాటాలు – 3, తరిగిన పచ్చిమిర్చి – 2, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, ఉడికించిన కందిపప్పు – అర కప్పు, బెల్లం – చిన్న ముక్క, నీళ్లు – తగినన్ని, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
మైసూర్ స్టైల్ రసం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత శనగపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ దినుసులన్నీ చల్లారిన తరువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకోవాలి. తరువాత గిన్నెలో టమాట ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు , కరివేపాకు వేసి ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత చింతపండు రసం, కందిపప్పు, బెల్లం, నీళ్లు పోసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మిశ్రమం, మరో రెమ్మ కరివేపాకు వేసి రసాన్ని మరింగించాలి.
రసం మరిగిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత తాళింపుకు నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మిగిలిన పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత రసంలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మైసూర్ స్టైల్ రసం తయారవుతుంది. దీనిని వేడి వేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారాలతో కూడా దీనిని తినవచ్చు. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా రసాన్ని తయారు చేసుకుని తింటే చక్కటి ఉపశమనం కలుగుతుంది.