Bellam Gulabi Puvvulu : మనం పండగలకు చేసే తీపి వంటకాల్లో గులాబి పువ్వులు కూడా ఒకటి. గులాబి పువ్వులు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. సాధారణంగా ఈ గులాబి పువ్వులను మనం పంచదారతో తయారు చేస్తూ ఉంటాము. పంచదారతో పాటు బెల్లంతో కూడా ఈ గులాబి పువ్వులను తయారు చేసుకోవచ్చు. బెల్లంతో చేసే గులాబి పువ్వులు కూడా చాలా రుచిగా ఉంటాయి. రుచిగా, క్రిస్పీగా బెల్లంతో గులాబి పువ్వులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం గులాబి పువ్వుల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – 2 కప్పులు, బియ్యం పిండి – 2 కప్పులు, బెల్లం తురుము – ఒక కప్పు, పంచదార – అర కప్పు, ఉప్పు – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బెల్లం గులాబి పువ్వుల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యంపిండి, ఉప్పు వేసి కలపాలి. తరువాత బెల్లం తురుము, పంచదార వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ముందుగా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి అరగంట పాటు పక్కకు ఉంచాలి. అరగంట తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. ఈ నూనెలోనే గులాబి పువ్వుల గుత్తిని ఉంచి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక పూల గుత్తిని తీసుకుని పిండిలో ముంచి తీసి నూనెలో ఉంచాలి. పూల గుత్తిని పిండిలో పూర్తిగా ముంచకూడదు. పిండి పూల గుత్తి నుండి పువ్వులా వేరయ్యే వరకు అలాగే ఉంచాలి. పిండి వేరవగానే పూల గుత్తిని బయట పెట్టకుండా అదే నూనెలో ఉంచి వేడి చేయాలి. ఈ గులాబి పువ్వును మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం గులాబి పువ్వులు తయారవుతాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా బెల్లంతో రుచిగా గులాబి పువ్వులను తయారు చేసుకుని తినవచ్చు.