Catering Style Vankaya Vepudu : మనం వంకాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో వంకాయ వేపుడు కూడా ఒకటి. వంకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ వేపుడును తయారు చేస్తూ ఉంటాము. అయితే ఎప్పుడూ ఒకే పద్దతిలో కాకుండా ఈ వంకాయ వేపుడును మరింత రుచిగా, క్రిస్పీగా కూడా తయారు చేసుకోవచ్చు. క్యాటరింగ్ స్టైల్ లో చేసే వంకాయ వేపుడు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. వంకాయలను తినని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. క్రిస్పీగా, రుచిగా వంకాయ వేపుడును క్యాటరింగ్ స్లైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాటరింగ్ స్టైల్ వంకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – పావుకిలో, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి – 3, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – 1, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్.
క్యాటరింగ్ స్టైల్ వంకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా వంకాయలకు ఉండే తొడిమలను తీసేసి వాటిని నిలువుగా సన్నని ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను నీళ్లు లేకుండా చేత్తో పిండుతూ గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇందులో మరలా నీళ్లు వేయకుండా బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వంకాయ ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో పల్లీలు, కరివేపాకు కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిపై అర టీ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ వేపుడు తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.