శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికీ అభిషేక ప్రియుడంటున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. సోమవారం నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడంవలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు … ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాలపాటు సకల శుభాలతో అలరారుతుంటాయి. అంతే కాకుండా, మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.సాధారణంగా శివుడిని నీటితో గానీ … పాలతోగాని అభిషేకిస్తుంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించినా ఫలితం ఒకేలా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది. మరి ఏ ఏ అభిషేకం వల్ల ఎలాంటి ఫలితం పొందవచ్చో చూద్దాం…
గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము, దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు. పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు. ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన.
ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తిత్వము లభించును. నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.