Palak Curry : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరలల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. పాలకూరతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పాలకూరతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పాలక్ కర్రీ కూడా ఒకటి. చాలా రుచిగా, కమ్మగా ఉండే ఈ కర్రీ రోటీ , చపాతీ వంటి వాటిల్లోకి చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ కర్రీని 15 నిమిషాల్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పాలక్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలకూర – 4 కట్టలు, తరిగిన టమాటాలు – 2, పచ్చిమిర్చి – 5 లేదా 6, నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, లవంగాలు – 2, యాలకులు – 2, సాజీరా – పావు టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – రెండు టీ స్పూన్స్, ఉప్పు – తగినంత.
పాలక్ కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో తరిగిన పాలకూర, టమాటాలు, పచ్చిమిర్చి వేసిమూత పెట్టాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలక్ కర్రీ తయారవుతుంది. దీనిని చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పాలక్ కర్రీని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.