Boil Eggs : మనం కోడిగుడ్లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. పిల్లలకు రోజూ కోడిగుడ్డును ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. అలాగే కోడిగుడ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి . గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యులు కూడా రోజూ ఒక గుడ్డును ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అలాగే ఏ వయసు వారైనా వీటిని ఆహారంగా తీసుకోవచ్చు.
కోడిగుడ్లతో రకరకాల వంటకాలు చేసుకుని తింటునప్పటికి వీటిని ఉడికించి తీసుకోవడం వల్ల మాత్రమే మనకు మేలు కలుగుతుంది. కోడిగుడ్లను ఉడికించి తీసుకోవడం వల్ల మాత్రమే వాటిలో ఉండే పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను మనం పూర్తి స్థాయిలో పొందగలుగుతాము. చాలా మంది కోడిగుడ్లను ఉడికించి తీసుకుంటున్నారు కూడా. అయితే కొన్నిసార్లు కోడిగుడ్లను ఉడికించే సమయంలో చేసే పొరపాట్ల వల్ల కోడిగుడ్లు బాగా ఉడికి గట్టిగా అయిపోతూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు ఉడికించిన కోడిగుడ్లపై ఉండే పొట్టు తీయడానికి సరిగ్గా రాదు. ఈ సమస్యను మనలో చాలా మంది చూసే ఉంటారు.
అయితే ఇప్పుడే చెప్పే చిట్కాలను పాటించడం వల్ల కోడిగుడ్లు చక్కగా ఉడకడంతో పాటు వాటిపై ఉండే పెంకు కూడా సరిగ్గా వస్తుంది. చాలా మందికి కోడిగుడ్లను ఎంత సమయం ఉడికించాలో తెలియదు. కొందరు అవి సరిగ్గా ఉడుకుతాయో లేదో అనే భావనతో చాలా సమయం వరకు ఉడికిస్తారు. కోడిగుడ్లను 4 నుండి 5 నిమిషాల పాటు ఉడికించడం వల్ల గుడ్డులో ఉండే తెల్లసొన గట్టిపడుతుంది. పచ్చసొన అలాగే ఉంటుంది. అదే 10 నుండి 13 నిమిషాల పాటు ఉడికించడం వల్ల గుడ్డు పూర్తిగా ఉడుకుతుంది.
గుడ్లను సరిగ్గా ఉడికించాలంటే ముందుగా గిన్నెలో కోడిగుడ్లను తీసుకోవాలి. ఇవి ఒకదాని మీద ఒకటి ఉండకుండా చూసుకోవాలి. తరువాత అవి మునిగే వరకు నీటిని పోయాలి. తరువాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసి వీటిపై మూత పెట్టి 10 నుండి 13 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని పారబోయాలి. తరువాత ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ ను వేసి మరలా మునిగే వరకు నీటిని పోయాలి. వీటిని 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటిని పారబోసి గుడ్లపై ఉండే పొట్టును తీసి వేయాలి. ఇలా చేయడం వల్ల కోడిగుడ్లు సరిగ్గా ఉడకడంతో పాటు వాటిపై ఉండే పొట్టు కూడా సులభంగా వస్తుంది.