Capsicum Masala Rice : మనం వంటింట్లో అనేక రకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు రుచిగా ఉండడంతో పాటు వీటిని చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా తయారు చేసుకోగలిగే రైస్ వెరైటీలలో క్యాప్సికం మసాలా రైస్ కూడా ఒకటి. క్యాప్సికంతో చేసే ఈ రైస్ వెరైటీ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా క్యాప్సికం మసాలా రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ క్యాప్సికం మసాలా రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం మసాలా రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన క్యాప్సికం – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన టమాట – 1, ఉడికించిన పచ్చి బఠాణీ – పావు కప్పు, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, చిల్లీ ప్లేక్స్ – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, అన్నం – 2 కప్పులు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
క్యాప్సికం మసాలా రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. వీటిని మెత్తబడే వరకు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి వేయించాలి. వీటిని మెత్తబడే వరకు వేయించిన తరువాత బఠాణీ వేసి కలపాలి. తరువాత పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చిల్లీ ప్లేక్స్, ఉప్పు వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత అన్నం వేసి కలపాలి. ఇప్పుడు మంటను చిన్నగా చేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం మసాలా రైస్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కూర ఏం చేయాలో తోచనప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా క్యాప్సికం రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు.