Paneer Tikka : మనకు రెస్టారెంట్ లలో లభించే పనీర్ వెరైటీలలో పనీర్ టిక్కా కూడా ఒకటి. పనీర్ టిక్కా చాలా రుచిగా ఉంటుంది. స్టాటర్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. చాలా మంది ఈ పనీర్ టిక్కాను రుచి చూసే ఉంటారు. ఈ పనీర్ టిక్కాను అదే రుచితో అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పనీర్ టిక్కాను తయారు చేయడం చాలా సులభం. ఇంట్లో పనీర్ ఉంటే చాలు చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ పనీర్ టిక్కాను రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ టిక్కా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – అర కప్పు, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, వేడి నూనె – ఒక టేబుల్ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పనీర్ – 300 గ్రా., పెటల్స్ లాగా తరిగిన ఉల్లిపాయ – 1, పెటల్స్ లాగా తరిగిన క్యాప్సికం – 2, నిమ్మరసం – అర చెక్క.
పనీర్ టిక్కా తయారీ విధానం..
ముందుగా పెరుగులో ఉండే నీరంతా పోయేలా ఒక వస్త్రంలో వేసి గట్టిగా పిండాలి. తరువాత నీరంతా పోయిన పెరుగును ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత వేడి నూనె వేసి రెండు నిమిషాల పాటు బాగా కలపాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పెరుగుతో పాటు మిగిలిన మసాలా పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత పనీర్ ముక్కలు, ఉల్లిపాయ పెటల్స్, క్యాప్సికం పెటల్స్ వేసి కలపాలి.చివరగా నిమ్మరసం వేసి అంతా కలిసేలా కలుపుకుని మ్యారినేట్ చేసుకోవాలి.
వీటిపై మూత పెట్టి అరగంట పాటు మ్యారినేట్ చేసుకున్న తరువాత వుడెన్ స్టిక్స్ ను తీసుకుని వాటికి మ్యారినేట్ చేసుకున్న పనీర్, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలను గుచ్చాలి. తరువాత స్టవ్ మీద మందంగా ఉండే పెనాని ఉంచి దానికి నూనె రాసి వేడి చేయాలి. తరువాత దీనిపై పనీర్ స్టిక్స్ ను ఉంచి కాల్చుకోవాలి. ఈ స్టిక్స్ ను అటూ ఇటూ తిప్పుతూ చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని రైతా, గ్రీన్ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలాసులభంగా, రుచిగా ఇంట్లోనే పనీర్ టిక్కాను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.